పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ ఈ రాష్ట్రంలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది…అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమత నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
ఆర్జీవీ ఏమన్నారంటే…
ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై స్పందించే ఆర్జీవీ, మమత తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. ‘దశాబ్దాల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఇలా ప్రవర్తించడం నమ్మలేకపోతున్నాను. ప్రజాస్వామ్యం అంటేనే వ్యవస్థల కలయిక. అటువంటి వ్యవస్థలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ఆమె ఈ నిజాన్ని ఎలా విస్మరిస్తున్నారు?’ అంటూ ఎక్స్ (X) వేదికగా ఆయన ప్రశ్నించారు.
బెంగాల్లో ఏం జరిగిందంటే..
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. దీంతో బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మెజారిటీ రాకపోయినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఎన్నికలను లూటీ చేశాయని ఆమె ఆరోపించారు. ‘నేను ఓడిపోలేదు, రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేసే ప్రశ్నే లేదు. అధికారికంగా మమ్మల్ని ఓడించి ఉండవచ్చు కానీ, నైతికంగా మేమే విజేతలం’ అని చెప్పారు. కౌంటింగ్ సమయంలో తనపై భౌతిక దాడి జరిగిందని, తన కడుపులో తన్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీసీటీవీలను కావాలనే ఆపివేసి తన ఏజెంట్లపై దాడులు చేశారని మండిపడ్డారు.
ఇకపై ‘ఫ్రీ బర్డ్’..
తాను ఇకపై ఎలాంటి పదవుల్లో లేనని, ఒక సామాన్యురాలిగా ‘ఇండియా’ (INDIA) కూటమిని బలోపేతం చేస్తానని మమత తెలిపారు. ’15 ఏళ్ల పాలనలో నేను ఒక్క పైసా జీతం గానీ, పెన్షన్ గానీ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఒక స్వేచ్ఛా విహంగాన్ని (ఫ్రీ బర్డ్) అని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’ అని ఆమె తెలిపారు. మరోవైపు బెంగాల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో అధికారం బదిలీ సజావుగా సాగుతుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.