రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి ఉత్తర కొరియా సైనికులు మరోసారి భారీగా అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యా తరఫున పోరాడిన ఉత్తర కొరియా బలగాలు భారీగా ప్రాణనష్టం చవిచూశాయి…అయినప్పటికీ మరిన్ని సైనికులను పంపేందుకు ప్యాంగ్యాంగ్ సిద్ధమవుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. గతంలో అంచనా వేసిన 30 వేల మందికి బదులుగా ఇప్పుడు 50 వేల వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే భారీగా ప్రాణనష్టం
2024 చివర్లో రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసిన సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా సైనికులను రష్యా తరఫున రంగంలోకి దించారు. మొత్తం 13 వేల మంది వరకు పంపినట్లు అంచనాలు ఉండగా.. వారిలో సుమారు 3 వేల మంది యుద్ధంలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసినప్పటికీ, క్రమంగా ఆధునిక డ్రోన్ యుద్ధ పద్ధతులకు అలవాటు పడిన ఉత్తర కొరియా దళాలు రష్యా సైన్యంతో కలిసి కుర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ బలగాలను వెనక్కి నెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రస్తుతం కుర్స్క్లో ఉన్న ఉత్తర కొరియా సైనికుల పరిస్థితి ఏమిటన్నది మరో ప్రశ్న. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం HUR ప్రకారం సుమారు 8,500 మంది ఉత్తర కొరియా సైనికులు ఇంకా రష్యా భూభాగంలోనే ఉన్నారు. వీరిని నాలుగు బ్రిగేడ్లుగా విభజించి, కుర్స్క్ ప్రాంతంలోని రష్యా సరిహద్దును కాపాడే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం వారు చురుకైన యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఆధారాలు లేవని HUR పేర్కొంది.
కిమ్‌కు ఇదే తొలి పెద్ద విదేశీ యుద్ధ ప్రయోగం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఇది అత్యంత కీలకమైన సైనిక ప్రయోగంగా మారింది. విదేశీ గడ్డపై ఇంత పెద్ద సంఖ్యలో ఉత్తర కొరియా సైనిక బలగాలను పంపడం ఆ దేశ చరిత్రలో అరుదైన విషయం. 1973లో ఇజ్రాయెల్-ఈజిప్ట్ యుద్ధ సమయంలో సుమారు 1,500 మంది సైనికులు, శిక్షకులను ఈజిప్ట్‌కు పంపిన ఉత్తర కొరియా.. 1960ల చివర్లో వియత్నాం యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సుమారు 87 మంది పైలట్లను పంపినట్లు రికార్డులు ఉన్నాయి. అయితే కుర్స్క్‌కు పంపిన బలగాల పరిమాణం వాటన్నింటికంటే చాలా ఎక్కువ. ఈ అనుభవం ఉత్తర కొరియాకు ఒకరకంగా సైనిక శిక్షణగా మారింది. ముఖ్యంగా డ్రోన్లు, ఆధునిక నిఘా వ్యవస్థలు, వేగంగా మారుతున్న యుద్ధ వ్యూహాలను ప్రత్యక్షంగా ఎదుర్కొనే అవకాశం ఆ దేశ సైనికులకు లభించింది. ప్రారంభంలో భారీ నష్టాలు ఎదురైనా.. యుద్ధ అనుభవంతో వారి వ్యూహాల్లో మార్పులు వచ్చినట్లు నిపుణుల అంచనా