ఎంపీ ఈటల రాజేందర్వి తప్పుడు ఆరోపణలని శ్రీహర్ష మేనేజింగ్ పార్ట్నర్ ఆలూరి వెంకటేష్ అన్నారు..మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాల్టీలో ఓ కాపలాదారుడిపై ఎంపీ ఈటల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి భూ యజమానులు వెంకటేష్, విజయ భాస్కర్తో కలిసి ఆలూరి వెంకటేష్ బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆవేశానికి కారణాలు తెలియరాలేదన్నారు. కానీ నిజనిజాలు తెలుసుకోకుండా ఆయన సహనం కోల్పోయి తమపై ఆరోపణలు చేయడంతోపాటు భౌతిక దాడులకు పాల్పడేలా ఉసిగొల్పడం తప్పేనన్నారు.
ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తున్నామని, సర్వే నెంబర్లు 739 నుంచి 742లో ఉన్న తమ 47.25 గుంటల భూమి ప్రస్తుతం పోచారం మున్సిపాలిటీలోని ఘట్కేసర్ మండలంలో కొర్రెముల గ్రామంలో ఉందన్నారు. కొందరు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు 743 నుంచి 747 వరకు ప్లాట్ల అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారని, అయితే అసలు ఆ సర్వే నెంబర్లే లేవని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. తాము ఒక్క గుంట భూమి అయినా ఆక్రమించినట్టు న్యాయస్థానంలో కానీ రెవెన్యూ రికార్డుల్లో కానీ చూపిస్తే సర్వం వదులుకుంటామని సవాల్ విసిరారు. వ్యవసాయ భూమిగా ఉన్న ఈ ప్రాంతంలో 2007 నుంచి నివాసాలు ఏర్పరచుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, 2010లో తీర్పునకు లోబడి తుది తీర్పు 2021 ఆగస్టు 3 వరకు తాము ఏ నిర్మాణాలూ చేపట్టలేదని, ప్లాట్లు కూడా అమ్మలేదని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకునే శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ సంస్థపై బురద చల్లొద్దని కోరారు..