9 లక్షల మంది రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..!..

9 లక్షల మంది రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..!

*సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి నోటిఫికేషన్*

*భూ కొనుగోళ్ల ఒప్పందాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం*

*సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి నోటిఫికేషన్*

*9 లక్షల మంది రైతులకు ఊరట*

కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల(సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో సుమారు 9 లక్షల మంది రైతులకు ఊరట లభించనుంది. భూ భారతి చట్టం ప్రకారం క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ చర్యలు సైతం ప్రారంభించింది.

2020 ఆర్వోఆర్ చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేకపోవడంతో అప్పట్లో ఈ ప్రక్రియను న్యాయస్థానం నిలిపివేసింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రకటించారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు కూడా చేపట్టారు. దీంతో తాజాగా హైకోర్టు సాదాబైనామా రైతులకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే.

*ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నిలిపివేత
రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ రెండో తేదీ ముందు వరకున్న సాదాబైనామా కొనుగోళ్లను 2016లో నాటి ప్రభుత్వం తొలిసారిగా క్రమబద్ధీకరించింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 6.18 లక్షల మేర క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

కానీ ఆర్వోఆర్-1971ను సవరించి తెచ్చిన ఆర్వోఆర్-2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లను చేర్చలేదు. పైగా 2020 చట్టం అమలులోకి రావడానికి ముందు, ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారి తీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నా ఈ ప్రక్రియ మాత్రం మొత్తం నిలిచిపోయింది. అప్పుడు వచ్చిన 9,00,894 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.

*భూ భారతిలో సెక్షన్లు :* ఆర్వోఆర్-2020 స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్-2025 భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్-6 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కూడా కల్పించారు. విచారణాధికారిగా ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించారు. క్రమబద్ధీకరణ పూర్తయితే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అవుతాయి. అలాగే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల ద్వారా పెద్ద ఎత్తున రాబడి అనేది వస్తుంది…