సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాల వేగం పెంచింది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతోనూ చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దిల్లీ నుంచి నేరుగా రాయ్పూర్ వెళ్లి ఛత్తీస్గడ్ సీఎం విష్ణుదేవ్సాయితో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణానికి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని ఛత్తీస్గడ్ సీఎంను రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఎన్వోసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు హామి ఇచ్చినట్లు తెలంగాణ సీఎంవో తెలిపింది. ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు. గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్వోసీ కీలకంగా మారింది. ప్రాజెక్టులో నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసినప్పుడు బ్యాక్ వాటర్ కారణంగా ఛత్తీస్ గఢ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయన్నది ఆ రాష్ట్ర అభ్యంతరం. గతంలోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలిసి ప్రాజెక్టు వివరాలను వివరించి ఎన్వోసీ కోరారు.సమ్మక్క సాగర్ ప్రాజెక్టును మొదట కాంతనపల్లి వద్ద ప్రతిపాదించినప్పుడు ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రతా మౌలిక సదుపాయాలతో పాటు 17 ఆదివాసీ గ్రామాలపై ప్రభావం పడుతుందని గుర్తించడంతో ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్పూర్ అధ్యయనం ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్గఢ్లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురి కానుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం వంద ఎకరాలకు మించదు. ఐఐటీ ఖరగ్పూర్ తన నివేదికను జులై 30న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9 కోట్ల 88లక్షలను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్లోనే చెల్లించింది.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరవు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుని ఎస్సారెస్పీ రెండో దశ కింద సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రామప్ప-పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్వోసీ పొందితే సమ్మక్క సాగర్ నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.