మార్కెట్ మాయాజాలం వెనుక,,కుప్పకూలిన వెండి ధరలు..!

మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. కేవలం ఒక్క రోజులోనే 25 శాతం(దాదాపు రూ.1,00,000) కుప్పకూలి రూ.3 లక్షల స్థాయికి చేరడం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద దిద్దుబాటుగా నిలిచింది… చరిత్రను పరిశీలిస్తే.. వెండి ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే దారుణంగా కుప్పకూలుతుందని స్పష్టమవుతోంది. తాజాగా జనవరి 29న వెండి మార్కెట్ మరోసారి చరిత్రను సృష్టించింది. కనిష్ట స్థాయిల నుండి ఏకంగా 934 రాబడిని అందిస్తూ వెండి ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ఈ గరిష్ట స్థాయి వద్ద ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి రావడంతో కేవలం కొన్ని గంటల్లోనే ధర 84 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న.. ఈ పతనం ఎక్కడి వరకు వెళ్తుంది?

చరిత్ర ఏం చెబుతోంది..?

వెండి గతంలో కూడా ఇలాంటి బూమ్ అండ్ బస్ట్ సైకిల్స్‌ను చూసింది:

1970-1980 కాలం

1975లో కేవలం 3.8 డాలర్ల వద్ద ఉన్న వెండి, చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా 1980 నాటికి 50 డాలర్లకి చేరింది. అంటే దాదాపు 1,188 శాతం పెరుగుదల. కానీ అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో వెండి మెరుపు కోల్పోయి ఏకంగా 89 శాతం పడిపోయింది.

2001-2011 కాలం

2001లో 4 డాలర్ల వద్ద ఉన్న వెండి 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత 2011 నాటికి 50 డాలర్లకి చేరింది. కానీ పరిస్థితులు చక్కబడగానే అది మళ్ళీ 72 శాతం మేర పతనమైంది.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

సాంకేతిక చార్ట్‌ల ప్రకారం.. వెండి ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. చరిత్ర పునరావృతమై, ప్రస్తుత పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువలపై నమ్మకం తగ్గినప్పుడు వెండి పెరుగుతుంది. అయితే గరిష్ట స్థాయిల వద్ద కొనుగోలు చేసిన వారు చరిత్రలో జరిగినట్లుగా 70-90శాతం క్షీణత సంభవిస్తే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. వెండి కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది మార్కెట్ భయానికి సూచిక. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో, సాంకేతిక చార్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం…