భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..!

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) గత వారం భారీ పతనం తర్వాత, మార్కెట్ కొంత స్థిరత్వాన్ని ఆశించింది. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 23) గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో బలమైన ప్రారంభంతో మొదలైంది. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటల సమయానికి BSE సెన్సెక్స్ 526.78 పాయింట్లు పెరిగి 78,568.37 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 146.50 పాయింట్లు పుంజుకుని 23,734 పరిధిలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 491 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 60 పాయింట్లు లాభపడి 59,943 పరిధిలోకి చేరింది..మెటల్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల పెరుగుదల నుంచి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. గ్యాస్ స్టాక్‌లు, బీమా షేర్లలో స్వల్ప బలహీనత నెలకొంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. ఈ క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్, HDFC బ్యాంక్, ట్రెంట్, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు టాప్ 5 లాభాలలో ఉండగా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, NTPC సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు.