విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొడితే, ఉపాధ్యాయులు దండించడాన్ని, మందలించడాన్ని మనం చూస్తుంటాం. కానీ ఒక ఊరిలో విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొడితే, వెంటనే మ్యూజిక్ మోత మోగుతుంది. స్కూలు ఏర్పాటు చేసిన రైడ్ టీమ్ విద్యార్థి ఇంటికి వచ్చి మరీ డోలు, హార్మోనియం, చిడతలు, గిలక్కాయలు, పిల్లనగ్రోవిని మోగిస్తుంది. తమతో పాటు విద్యార్థిని స్కూలుకు తీసుకెళ్తుంది. ఇంతకీ ఇలా ఎక్కడ జరుగుతోంది ? నిరుపేద, అణగారిన వర్గాల విద్యార్థుల డ్రాపౌడ్ రేటును గణనీయంగా తగ్గించిన ఈ మెరుపు ఐడియా ఎవరిది ? దీని గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆ టీచర్ చొరవ- సీన్ రివర్స్
విద్యార్థుల డ్రాపౌడ్ రేటును తగ్గించేందుకు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్న ఆ స్కూలును చూడాలంటే మనం బిహార్‌లోని గయ జిల్లా కొర్మతు గ్రామానికి వెళ్లాలి. ఈ ఊరిలోని ఒక వాడలో పూర్తిగా మహాదళిత వర్గం ప్రజలే నివసిస్తుంటారు. ఈ వర్గం ప్రజలు నేటికీ కడు బీదరికంలో జీవిస్తున్నారు. మహాదళితులు నివసించే ఈ వాడను స్థానికులు మహాదళిత్ టోలా అని పిలుస్తుంటారు. ఈ ఏరియాలోని 80కిపైగా కుటుంబాల పిల్లల కోసం ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. రెండేళ్ల క్రితం, ఈ స్కూలులోని మొత్తం విద్యార్థుల సంఖ్య 100కు లోపే. చదువును మధ్యలోనే మానేసే డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 138కి పెరిగింది. డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ మార్పుకు కారణం ఓ టీచర్. ఆయన పేరు ఇమ్రోజ్ అలీ.
విద్యార్థులతో రైడ్ టీమ్..
టీచర్ ఇమ్రోజ్ అలీ తొలుత మహాదళిత్ టోలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు, పిల్లల డ్రాపౌట్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. ఏటా పిల్లల అడ్మిషన్లు తగ్గిపోతుండేవి. ఆ సమయానికి స్కూలులో సంగీత పరికరాలు కూడా ఉండేవి కావు. దీంతో విద్యార్థుల హాజరును పెంచడానికి టీచర్ ఇమ్రోజ్ అలీ, ఇతర టీచర్లతో కలిసి పిల్లల ఇళ్లకు వెళ్లేవారు. పిల్లలను రోజూ బడికి పంపాలని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసేవారు. చదువు ప్రాధాన్యతను పిల్లలకు వివరించేవారు. ఈక్రమంలో విద్యా శాఖ నుంచి పాఠశాలకు సంగీత పరికరాలు అందాయి. వాటిని వాయించడాన్ని విద్యార్థులకు టీచర్ ఇమ్రోజ్ అలీ నేర్పించారు. అనంతరం స్కూలులోని ఒక్కో క్లాస్‌కు ఒక్కో విద్యార్థి చొప్పున మానిటర్లను నియమించారు. ప్రతినెలా క్లాస్ మానిటర్‌ను మార్చే ఏర్పాట్లు చేశారు. స్కూలులోని అన్ని క్లాసులకు చెందిన 15 మంది పిల్లలతో ఒక రైడ్ టీమ్‌ను ఇమ్రోజ్ అలీ ఏర్పాటు చేశారు. మహాదళిత్ టోలా పాఠశాలలో చదివే విద్యార్థులందరి ఇళ్లు అర కిలోమీటరు దూరంలోనే ఉంటాయి. ఒకవేళ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే స్కూలుకు గైర్హాజరైతే, ఈ రైడ్ టీమ్‌లోని 15 మంది విద్యార్థులు కలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్తారు. సంగీత పరికరాలను కాసేపు వాయించి, ఆ పిల్లలను తమతో పాటు స్కూలుకు తీసుకొస్తారు.