ఎవరైనా కనిపించ కుండా పోతే తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: సుప్రీంకోర్టు హెచ్చరిక..

ఏ వ్యక్తి అయినా కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే వయస్సు, లింగ భేదం లేకుండా తప్పనిసరిగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను స్పష్టంగా ఆదేశించింది.

గతంలో తామిచ్చిన ఉత్తర్వుల్లోని ‘వ్యక్తి’ అనే పదానికి కేవలం పిల్లలు మాత్రమే పరిమితం కాదని, పెద్దలు కూడా అందులోకి వస్తారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను తు.చ. తప్పకుండా అమలు చేయని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.

జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమనుల్లా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మానవ అక్రమ రవాణా నిరోధం, కానరాకుండా పోయిన వారి ఆచూకీకి సంబంధించిన కేసును సమీక్షిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

గతంలో మే 22న ఇచ్చిన ఆదేశాల్లో వ్యక్తులు కనిపించకుండా పోతే తక్షణమే కేసు నమోదు చేయాలని పేర్కొనగా, కొన్ని రాష్ట్రాలు ‘వ్యక్తి’ అంటే కేవలం పిల్లలు మాత్రమేనని భావిస్తూ బాధ్యత నుంచి తప్పుకోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రాలు లేవనెత్తిన ఈ అంశం దుర్బుద్ధితో కూడుకున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
సమాచారం అందిన వెంటనే ప్రాథమిక విచారణ పేరుతో కాలయాపన చేయకుండా లేదా బాధితుల కుటుంబ సభ్యులే వెతుక్కోవాలని వదిలేయకుండా, పోలీసు యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగాలని న్యాయస్థానం ఆదేశించింది.

వ్యక్తి కానరాకుండా పోయిన ప్రారంభ సమయమే ‘గోల్డెన్‌ అవర్స్‌’ అని, ఆ సమయం లోనే సురక్షితంగా ఆచూకీ కనుగొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమై, ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబరు 5న జరిగే తదుపరి విచారణకు వీరంతా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా అక్రమ రవాణా నిరోధక విభాగాలు (AHTU) పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని మరియు కనిపించకుండా పోయిన వారి పోర్టళ్లను అనుసంధానించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.