సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం…!

కమ్మూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో సుధాకర్ రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు…1998, 2004లో లోక్ సభ ఎంపీగా గెలిచారు సుధాకర్ రెడ్డి. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సురవరం సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు..

సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పీడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన తెలంగాణ బిడ్డ సురవరం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సురవరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం.

సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ సీఎం కేసీఆర్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలు పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు..

Cm రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం.

సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారని.. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప నాయకుడు అని చెప్పారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

సురవరం సుధాకర్‌ రెడ్డి మరణించారని తెలిసి షాకింగ్‌కు గురయ్యానన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తనను స్టాలిన్ బాబు సీపీఐ వైపు ఆకర్షిస్తే, సుధాకర్‌ రెడ్డి పార్టీలో నా ఎదుగుదలకు ప్రతిసందర్భంలోనూ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి అతిసన్నిహితులు అన్నారు. వారి మరణం సీపీఐకి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి, నాకు, మా కుటుంబానికి తీరని లోటని నారాయణ సంతాపం తెలిపారు.