సూరేపల్లి వెంకటేశ్వర్లు కు ప్రతిష్టాత్మక శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు..
దేవరకొండ………
చేనేత అభివృద్ధికి విశిష్ట సేవలు… కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు అందుకున్న డిజైనర్ సూరేపల్లి వెంకటేశ్వర్లు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ సూరేపల్లి వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు – 2026 ను డిజైనర్ విభాగంలో అందుకున్నారు.
సుమారు 20 సంవత్సరాలుగా చేనేత రంగంలో సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు అందులో 12 సంవత్సరాలకు పైగా డిజైనర్‌గా పోచంపల్లి డబుల్ ఇకట్ డిజైన్ల రూపకల్పనలో విశేష నైపుణ్యాన్ని కనబరిచారు. పద్మశ్రీ శ్రీ గజం అంజయ్య వద్ద పనిచేస్తూ డిజైనింగ్, ఉత్పత్తి పర్యవేక్షణ, నాణ్యతాభివృద్ధి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న డిజైన్ల రూపకల్పనలో విలువైన అనుభవాన్ని సంపాదించారు.
ఈ అవార్డుకు ఎంపికైన ఆయన డిజైన్‌కు ప్రకృతిలోని పక్షి రెక్కల సమతుల్యత ప్రేరణగా నిలిచింది. పక్షి రెక్కలలో కనిపించే సమానత్వం, లయ, జ్యామితీయ ఆకృతులను సంప్రదాయ పోచంపల్లి డబుల్ ఇకట్ కళతో మేళవించి రూపొందించిన ప్రత్యేక చీరకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. బాడీలో క్లిష్టమైన డబుల్ ఇకట్ మోటిఫ్‌లు, సరళమైన బోర్డర్, సంప్రదాయ జరీ టిష్యూ పల్లూ, సాదాసీదా బ్లౌజ్ రూపకల్పన ద్వారా సంప్రదాయం–ఆధునికత మధ్య సమతుల్యతను ప్రతిబింబించేలా
ఈ డిజైన్‌ను రూపొందించారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నివసిస్తూ చేనేత రంగంలో సేవలందిస్తున్న వెంకటేశ్వర్లు , తాను చిన్నప్పుడు చదువుకున్న దేవరకొండ ప్రాంతంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో దేవరకొండలోని ముదిగొండ ఎక్స్ రోడ్డు వద్ద చేనేత కళాక్షేత్రం ను ఏర్పాటు చేసి, చేనేతపై ఆసక్తి ఉన్న మహిళలు, వితంతు మహిళలు గ్రామీణ యువతకు ఉచితంగా చేనేత శిక్షణ అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించారు. చేనేతను కేవలం ఒక వృత్తిగా కాకుండా, గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే జీవన విధానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన సేవలు అందించారు.
అదేవిధంగా, దేవరకొండ ప్రాంతంలో ఒకప్పుడు వెలుగొందిన చేనేత పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో స్వగ్రామంలో మగ్గాలను ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీ సురేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
ఈ అవార్డు నాకు మాత్రమే కాదు… నా గురువు పద్మశ్రీ గజం అంజయ్య ప్రోత్సాహంకి, నాతో కలిసి శ్రమిస్తున్న ప్రతి చేనేత నేయకారుడికి, నా కుటుంబ సభ్యులకు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవం.
ఈ గుర్తింపు చేనేత కళను భావితరాలకు చేరవేయాలనే నా బాధ్యతను మరింత పెంచింది. దేవరకొండ ప్రాంతంలో మళ్లీ మగ్గాల శబ్దం వినిపించే వరకు ప్రయా prayathnam చేస్తూ ఉంటాను.”
అని తెలిపారు.
చేనేత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడంతో చేనేత కార్మికులు, శిష్యులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు..