T20 ప్రపంచ కప్ 2026 లో దాదాపు అన్ని మ్యాచ్‌లలో చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిచ్చినంత పని చేశాయి. తాజాగా ఐదవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నేపాల్ టీంతో అదే పరిస్థితి ఎదురైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠపోరులో నేపాల్ మీద ఇంగ్లాండ్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
ఒకనొక దశలో నేపాల్ జట్టు సులభంగా ఇంగ్లాండ్‌ను ఓడిస్తుందని అనిపించింది. కానీ చివరికి ఇంగ్లాండ్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెథెల్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో నేపాల్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కర్రాన్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంతో ఇంగ్లాండ్ విజయం సాధ్యమైంది.
సామ్ కర్రాన్ ఇంగ్లాండ్ టీంకు హీరోగా నిలిచాడు. చివరి ఓవర్లో నేపాల్ కనుక 10 పరుగులు చేస్తే నెగ్గేది. కానీ కర్రన్ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఖచ్చితమైన యార్కర్లతో నేపాలీ బ్యాటర్లను కట్టడి చేయడం హైలైట్. దాంతో మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొంది.
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 53 పరుగులు సాధించగా, విల్ జాక్స్ 18 బంతుల్లో 39 అజేయంగా నిలిచి చివరి దశలో ఆటను కొనసాగించాడు. వారి ప్రయత్నాలు ఇంగ్లాండ్ కోలుకోవడానికి మరియు 7 వికెట్లకు 184 పరుగుల పోటీ స్కోరును నమోదు చేయడానికి సహాయపడ్డాయి.
నేపాల్ ఆటగాళ్ల ఇన్నింగ్స్ వృథా
నేపాల్ జట్టులో దీపేంద్ర సింగ్ ఏరి, లోకేష్ బామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే, వీరి ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. దీపేంద్ర 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. దీంతో పాటు లోకేష్ 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులతో రాణించాడు.