తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారుల తనిఖీలు…!

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకన అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్ పరిధిలోని కాశీమ్ బౌలిలో ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని ట్రూగ్రేడర్ సంస్థతో పాటు అల్వాల్‌లోని వెంకటాపురంలోనూ ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఆవాస రిసార్ట్‌లోనూ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం…

గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంతో సంబంధం ఉన్న క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. గ్రూప్-1 మూల్యాంకనానికి చెల్లించిన నిధులు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణ జరుపుతోంది..అర్హతలేని 66 మందితో గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారని సిట్ ఆరోపించింది. మూల్యాంకనానికి క్యామ్‌సైన్ మీడియాకు రూ.1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడించింది. మూల్యాంకన పత్రాల్లో 287 బార్‌కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగాన్ని గుర్తించినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. 173 మంది సాక్షులను విచారించి, ఫోరెన్సిక్ ఆధారాలను సిట్ పరిశీలించింది. గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై 2025 ఏప్రిల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావును గతంలోనే అరెస్టు చేశారు. సిట్ దర్యాప్తు నేపథ్యంలో 2026 అక్టోబర్‌లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తాజాగా సోదాలు నిర్వహించింది…