తెలంగాణ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా…హరీశ్‌రావు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మధ్య మాటల యుద్ధం…!

తెలంగాణ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా రెండో రోజు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు నిన్నటి పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మధ్య మాటల యుద్ధం సాగింది.
మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణమని హరీశ్‌రావు మండిపడ్డారు. నిన్న పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. అసెంబ్లీ కౌరవసభగా మారిందని అన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నా తల్లిదండ్రులను అవమానించారు”
హరీశ్‌రావు వ్యాఖ్యలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఘాటుగా స్పందించారు. తన పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారని, తన తల్లిదండ్రులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి అంటే తనకు గౌరవమని, వారు తనకు తోబుట్టువులతో సమానమని స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డికి జరిగిన ఘటనపై తానే విచారణకు ఆదేశించానని తెలిపారు.
“మీ తల్లిని అనలేదు హరీశ్‌.. మరి నా సంగతి ఏంటి? ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడండి” అంటూ స్పీకర్‌ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ సభ్యుల ఆగ్రహం
బీఆర్‌ఎస్‌ సభ్యులు చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు విమర్శించారు. దళిత స్పీకర్‌ పట్ల అమానుషంగా వ్యవహరించారని, జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.
మహిళా ఎమ్మెల్యేలు సభలో ఉన్నారనే కనీస గౌరవం లేకుండా చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏమిటని మంత్రి సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారు.
“స్పీకర్‌పై మాకు గౌరవం ఉంది” – హరీశ్‌రావు
మరోసారి జోక్యం చేసుకున్న హరీశ్‌రావు.. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌పై తమకు గౌరవం ఉందన్నారు. స్పీకర్‌పై తమ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలపై నిన్ననే విచారం వ్యక్తం చేశారని, తాము కూడా విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
అయితే, కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ఎందుకు చేయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
హరీశ్‌రావు వైఖరిపై శ్రీధర్‌బాబు ఫైర్‌
హరీశ్‌రావు వ్యవహారశైలి స్పీకర్‌ను బెదిరించేలా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన ఘటనను పక్కన పెట్టాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
“స్పీకర్‌ను డిక్టేట్‌ చేయడం ఏంటి? స్పీకర్‌ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ?” అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులపై మండిపడ్డారు.
అయితే నిన్నటి పరిణామాలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తంగా.. తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభంలోనే బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదంతో సభ వాతావరణం వేడెక్కింది