పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
Cabinet Meeting on Schemes in Telangana.
సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, హ్యామ్ రహదారులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకంలో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా, అంచనాలకు మించి సుమారు పదహారున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో రూ.లక్ష వరకు కేటగిరీ లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించాలని భావించినప్పటికీ గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి విడతలో ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, ఇటుక, స్టీలు ఇతర నిర్మాణ సామగ్రిని అందుబాటులో చౌక ధరలకు అందించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం సాగు సన్నద్ధత, రైతు భరోసాపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణంపై చర్చించనున్నారు.