3న అధిష్ఠానంతో సీఎం, డిప్యూటీ, పీసీసీ చీఫ్‌ భేటీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ సెప్టెంబరు 1న ఢిల్లీకి తిరిగి రానున్నట్లు, అనంతరం ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మూడో తేదీన జరగనున్న చర్చల్లో కొండా సురేఖ వ్యవహారంతోపాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ వివాదానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. దీనిపై అదిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినా.. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను ఢిల్లీకి పిలిపిస్తుండడంతో కేవలం కొండా సురేఖపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకోవడానికేనా? లేక మొత్తంగా మంత్రివర్గంలో మార్పులు, పార్టీ వ్యవహారాలపై సమగ్ర చర్చ కోసమా? అన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది.