తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు…! క్యాబినెట్‌లో కొత్తగా ముగ్గురు..! .

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది…

ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్‌కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది..

రేపు సాయంత్రం కొత్త మంత్రులతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో విజయశాంతి, వాకటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, ఎస్సీ కోటాలో అద్దంకి దయకర్, వివేక్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు తమ నుంచి ఒకరికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ను పట్టుబడుతున్నారు. దీంతో ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

కోమటిరెడ్డికి షాక్.. సుదర్శన్ రెడ్డికే ఛాన్స్?

రెడ్డి సమాజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఒకరికి పక్కాగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేకపోవడం సుదర్శన్ రెడ్డికి కలివచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫైనల్ లిస్ట్ ఇదే..?

తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం మూడింటిని మాత్రమే ప్రస్తుతం భర్తీ చేయాలన్నది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్/వివేక్ వెంకటస్వామిలో ఒకరికి ఛాన్స్ పక్కా అని సమాచారం.