తెలంగాణలో వచ్చే పదేళ్లు మనదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి..

రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్, రుణ మాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు…..నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు.

బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని అన్నారు. తాము మాత్రం తెలంగాణ బిడ్డలు ప్రభుత్వ ఆఫీసర్లయి, మంచి ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు.

తాను చెప్పిన లెక్కల్లో ఒక్కటి తక్కువైందని ఎవ్వరు నిరూపించినా క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ చేశారు…

చర్చకు ఎవరొస్తారో రండి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04లక్షల కోట్లు ఖర్చు చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని గత సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.80 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండించి దేశానికే ఆదర్శంగా నిలిచాం అని చెప్పుకొచ్చారు. ‘రైతు భరోసా విఫలమవుతుందని గోతికాడ నక్కల్లా కొందరు ఎదురుచూశారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశాం.’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రైతు రాజ్యం ఎవరు తెచ్చారో.. ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం. చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్‌, మోడీ, కిషన్‌రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా సరే. నేను సిద్ధం’అని సవాల్ విసిరారు. ‘కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా.. పేదలు ఎప్పుడూ బర్రెలు, గొర్రెలు మేపుతూనే బతకాలా? మేం తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్‌, మోడీకి సవాల్‌ విసురుతున్నా. లెక్క కావాలంటే చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి స్టేడియంలో నిలబెట్టి లెక్కవేయిస్తా. 60వేలకు ఒక్కరు తక్కువ వచ్చినా కాళ్లు మొక్కి తప్పుకొంటా’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

స్థానిక పోరులో గెలుపు బాధ్యత నేనే తీసుకుంటా
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రభుత్వం తరపున ప్రచారకర్తలుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరగబోతున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాయని….అందులో ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యత అని సీఎం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 15 లోక్‌సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు….

తెలంగాణ క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌ అంశం మరోసారి తెరపైకి..!

తెలంగాణ క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉంటే..ఎన్నోవాయిదాలు..మరెన్నో అడ్డంకులు..చాలా ఈక్వేషన్స్ తర్వాత మూడింటిని భర్తీ చేశారు. మిగిలిన మూడు పదవులను కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలోపే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందట..