ఈ 4 పథకాలకు నేటి నుండి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..!….!

తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల్లో ఏదైనా లబ్ది పొందేవారైతే.. అలర్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది…ఎందుకంటే ప్రభుత్వం జనవరి 26న ఈ 4 పథకాలనూ ప్రారంభిస్తోంది. అంటే.. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.12,000 చొప్పున ఇవ్వబోతోంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద.. ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీలకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఇవ్వబోతోంది. ఇంకా.. ఇందిరమ్మ ఇళ్ల తొలిదశలో భాగంగా స్థలం ఉన్న వారికి.. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇవ్వబోతోంది. అలాగే.. 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది. ఐతే.. ఒక పెద్ద మెలిక ఉంది.

ట్విస్ట్ అదే:
ఈ 4 పథకాలూ పొందాలంటే.. లబ్దిదారుల జాబితాలో పేరు ఉండాలి. ఈ జాబితాలను ప్రభుత్వం గ్రామ సభల్లో ఉంచుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలు గ్రామ సభలకు వచ్చేశాయి. వాటిలో తమ పేర్లు లేవని కొంతమంది లబోదిబోమంటున్నారు. దాంతో.. విషయం ప్రభుత్వ పెద్దలకు చేరింది. దాంతో.. ఇవాళ్టి (జనవరి 21) నుంచి.. మరోసారి లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు.

వారికి మాత్రమే:
లబ్దిదారుల జాబితాలో పేరు లేని వారు మాత్రమే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. లేదా గ్రామ సభకు వెళ్లినప్పుడు.. అక్కడ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఐతే అధికారులు.. అర్హత ఉందో లేదో పరిశీలించడానికి సంబంధిత రుజువు పత్రాలు చూపించాలని కోరవచ్చు. అందువల్ల దరఖాస్తు పెట్టుకునేవారు.. ఆధార పత్రాలను కూడా తీసుకెళ్లడం మేలు.

నాలుగు రోజుల్లో:
ప్రభుత్వం ఈ దరఖాస్తులను మళ్లీ తీసుకొని.. వాటిని పరిశీలించి.. మళ్లీ జాబితాలో పేర్లను యాడ్ చేస్తుంది. ఇదంతా 3 రోజుల్లో అయిపోతుంది. జనవరి 25న ఫైనల్ జాబితాలను గ్రామ సభల్లో ఉంచుతారు. ఆ తర్వాత జనవరి 26న పథకాలను ప్రారంభించి.. లబ్ది ఇవ్వడం మొదలుపెడతారు. ఐతే.. ఫైనల్ జాబితాలో కూడా ఎవరైనా పేర్లు మిస్సైతే.. వారు ప్రజాపాలనలో మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. వాటిని ఆ తర్వాత పరిశీలిస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు గ్రామ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఆయా పథకాల్లో తమ పేరు ఉందో లేదో చూసుకుంటున్నారు..