తెలంగాణలో 26 లోక్‌సభ ఎంపీలు, 182 ఎమ్మెల్యే సీట్లు!
డీలిమిటేషన్ అనంతరం తెలంగాణలో ఎంపీలు 26, ఎమ్మెల్యేలు 182 పెరగబోతున్నట్లు సమాచారం
మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల 8 లేదా 9 ఎంపీ స్థానాలు, దాదాపు 60 ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు కేటాయింపు
అయితే 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉండగా, తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతి రాష్ట్రంలో 50% అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు ప్రతిపాదనలు
దీంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 182కు పెరగనున్నట్లు సమాచారం
ఈ పునర్విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తుండటంతో, 10 ఉమ్మడి జిల్లాలనే యూనిట్లుగా తీసుకునే అవకాశం
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభలో 8 లేదా 9 మంది, శాసనసభలో దాదాపు 60 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉంటారని అంచనా..
దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులకు తెరలేపేలా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జనగణనతో సంబంధం లేకుండా, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఢిల్లీలో ఆమోదం తెలిపింది. గతంలో తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు పలు మార్పులు చేసి తాజా బిల్లును రెడీ చేశారు. ఈ నెల 30న ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.
గత ఏప్రిల్‌లోనే ఈ బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చినా, 50 శాతం పెంపు అంశం లిఖితపూర్వకంగా లేదంటూ విపక్ష ఇండియా కూటమి అభ్యంతరం చెప్పడంతో 2/3 వంతు మెజార్టీ రాక వీగిపోయింది. ఆ పాత బిల్లును సాంకేతికంగా ఉపసంహరించుకుని, ఇప్పుడు కొత్త సవరణలతో ముందుకు వస్తున్నారు.
పార్లమెంటులో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు (132వ రాజ్యాంగ సవరణ బిల్లు), కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి మొత్తం మూడు బిల్లులను తీసుకురానున్నారు. దేశంలో లోక్‌సభ గరిష్ఠ స్థానాలను 850కి (రాష్ట్రాల్లో 815, యూటీల్లో 35), అసెంబ్లీల గరిష్ఠ పరిమితిని 500 నుంచి 650కి పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 50 శాతం పెంపు వల్ల సీట్లు 600 దాటే అవకాశం ఉన్నందున, అక్కడ 650 వరకు పెంచుకునేలా ప్రత్యేక నిబంధనను కూడా చేరుస్తున్నారు.