తెలంగాణ ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.
హైదరాబాద్: తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 10, 2026 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగిందని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా 78.30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో నమోదై ఉన్న వారిలో 2.73 శాతం, అంటే 9,22,229 మంది మరణించినట్లు గుర్తించినట్లు తెలిపారు.
అలాగే శాశ్వతంగా చిరునామా మార్చుకున్నవారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినవారు కలిపి 57,46,803 మంది ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. మరో 16.99 శాతం మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో BLOలు వారిని కలవలేకపోయారని వెల్లడించారు.
ఇక 6.24 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల నమోదై ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించి జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఓటు హక్కు కోల్పోయిన వారికి అవకాశం
ఆగస్టు 17, 2026 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు ఓటు హక్కు కోల్పోయినవారు, అలాగే కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం సమర్పించి తిరిగి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
మరోవైపు 32.2 లక్షల మంది ఓటర్లు సరైన వివరాలు నమోదు చేయకపోవడంతో మ్యాపింగ్ కాలేదని తెలిపారు. వీరితో పాటు 2002 నాటి వివరాలు నమోదు చేయని ఓటర్లకు సంబంధిత ఈఆర్ఓల ద్వారా నోటీసులు అందజేస్తామని చెప్పారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ స్థానికతను నిరూపించే గుర్తింపు పత్రాలతో సంబంధిత ఈఆర్ఓల ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్లు సమర్పించే వివరణ, స్థానికతకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం అర్హులైన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ.. అనర్హమైన, డూప్లికేట్, మృతుల పేర్లను తొలగించి పారదర్శకమైన తుది జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోంది.