విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు బ్రేక్.. ఉద్యోగుల్లో తీవ్ర భావోద్వేగం..

విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు బ్రేక్.. ఉద్యోగుల్లో తీవ్ర భావోద్వేగం

విశాఖ విమానాశ్రయంలో సాధారణ విమాన సేవలకు విరామం పడనుంది. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లే చివరి విమాన సర్వీస్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఆపరేషన్స్ నిలిచిపోనున్నాయి.

ఇన్నాళ్లుగా విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఈ పరిణామంతో భావోద్వేగానికి గురవుతున్నారు. తమ ఉద్యోగాలు, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌
Vizag Airport లో ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్, పోలీసు, ప్రభుత్వ అతిథుల విమానాలతో పాటు నాన్‌షెడ్యూల్డ్ కమర్షియల్ కార్గో విమానాలకు మాత్రమే సేవలు కొనసాగనున్నట్లు సమాచారం.

విశాఖపట్నం పౌర విమానాశ్రయం సుదీర్ఘ ప్రయాణంలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల రాకపోకలకు నిలయంగా నిలిచిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కమర్షియల్ విమాన సేవలకు అధికారికంగా విరామం పడింది. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరిన చివరి సర్వీసుతో రెగ్యులర్ ప్రయాణికుల కార్యకలాపాలు ముగిశాయి. ఇకపై ఈ ప్రాంత ప్రయాణికుల సేవలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే కొనసాగనున్నాయి…చివరి విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్‌లో ఒక విధమైన నిశ్శబ్దం, భావోద్వేగం అలుముకున్నాయి. అనేక ఏళ్లుగా ఇక్కడ సేవలందించిన ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికులు కంటతడి పెట్టుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను సాదరంగా ఆహ్వానించిన చోట, ఇప్పుడు ప్యాసింజర్ సేవలు నిలిచిపోవడం తమ కుటుంబంలో ఒక భాగం దూరమైనట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ఉద్యోగ భద్రత, కేటాయింపులపై స్పష్టత లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు…పౌర విమాన సేవలు నిలిచిపోయినప్పటికీ, విశాఖ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా మూతపడదు. ఇండియన్ నేవీ నియంత్రణలో ఉన్న ఈ రన్‌వేను ఇకపై ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తారు. నేవీ, మిలిటరీ విమానాల ఆపరేషన్స్ ఎప్పటిలాగే సాగుతాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల (విఐపి) విమానాలు, హెలికాప్టర్లకు అనుమతి ఉంటుంది. నాన్-షెడ్యూల్డ్ కమర్షియల్ కార్గో విమాన సేవలు కొనసాగుతాయి. విశాఖ నగరం మధ్యలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌తో దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రజలకు ఇది ఒక రకంగా చేదు వార్తే అయినప్పటికీ, భోగాపురంలో అధునాతన వసతులతో కూడిన కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.