తిలక్ వర్మ విన్నింగ్ సిక్స్..గంభీర్ సంబరాలు..!

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు..అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తిలక్ వర్మ రెండో బంతిని సిక్సర్‌గా తరలించి విజయాన్ని ఖాయం చేయడంతో గంభీర్ వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. తన ముందున్న డెస్క్‌ను బలంగా కొడుతూ కనిపించాడు. ఈ సన్నివేశం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా గంభీర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోడు. కానీ కోచ్‌గా మారిన తర్వాత ఆయన చాలా మౌనంగా కనిపించేవాడు. కానీ తాజా మ్యాచ్‌లో మాత్రం సంతోషాన్ని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ బల్లను గుద్దాడు..