ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత టోర్నమెంట్ ట్రోఫీని తీసుకోలేదు. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, తొమ్మిదోసారి ఈ టోర్నమెంట్‌ను తన పేరు మీద నమోదు చేసుకుంది. అయితే, దీని తర్వాత టీమిండియాకు ఛాంపియన్‌గా ట్రోఫీని ఎత్తే అవకాశం లభించలేదు. జట్టు ట్రోఫీ లేకుండానే తిరిగి వచ్చేసింది. దీనికి కారణం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు అయిన మోహసిన్ నఖ్వీ. టీమిండియా ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది..
టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, టీమిండియా విజయం తర్వాత ప్రెజెంటేషన్ వేడుక వివాదాస్పదంగా మారింది. భారత జట్టు పీసీబీ, ఏసీసీ అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా. అంతేకాకుండా, అతను భారత జట్టు, భారత్‌ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్‌లు కూడా చేశాడు. దీని కారణంగానే టీమిండియా ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది.
మరోవైపు, మోహసిన్ నఖ్వీ కూడా తన పట్టుదలను విడిచిపెట్టలేదు. ఏసీసీ నిబంధనల ప్రకారం అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టారు. దీని కారణంగా ప్రెజెంటేషన్ వేడుకకు చాలా ఆలస్యం జరిగింది. మ్యాచ్ ముగిసిన ఒకటిన్నర గంట తర్వాత ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థానీ ఆటగాళ్లు తమ పతకాలను అందుకున్నారు. కానీ టీమిండియా విజేతల పతకాలను తీసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా, టీమిండియా ట్రోఫీని తీసుకోవడానికి కూడా నిరాకరించింది..
మిసైల్ సంబరం..
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హారిస్ రవూఫ్‌ను అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేసిన జస్ర్పీత్ బుమ్రా.. భిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. తాను వేసిన బంతి మిసైల్‌లా దూసుకొచ్చి వికెట్లను కూల్చిందన్న అర్ధం వచ్చేలా మిసైల్ కూలినట్లుగా సంజ్ఞ చేశాడు. భారత్‌తో సూపర్ -4 మ్యాచ్‌లో పేసర్ రవూఫ్ వివాదాస్పద రీతిలో ఆరు యుద్ధ విమానాలను కూల్చినట్లు సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రేగింది. అతడికి మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా కూడా పడింది. తాజాగా.. బుమ్రా వికెట్ తీసిన సమయంలో మిసైల్ సంబరాలు చేసుకొని హారిస్ రవూఫ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
భారత జట్టు ఈ ‘నో హ్యాండ్‌షేక్’ పాలసీని అనుసరించడం వెనుక ప్రధానంగా రాజకీయ, సైనిక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన నిర్ణయాన్ని పరోక్షంగా వెల్లడించారు. భారతదేశ సాయుధ బలగాలకు మద్దతుగా, కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు సంఘీభావంగానే తాము ఈ వైఖరిని తీసుకున్నామని ఆయన ప్రకటించారు.
పాకిస్తాన్ ఆటగాళ్ల నుంచి వచ్చిన కొన్ని వివాదాస్పద సంజ్ఞలు కూడా ఉద్రిక్తతలను పెంచాయి. సూపర్-4 మ్యాచ్‌లో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ ‘విమానం క్రాష్’ అయినట్లు సంజ్ఞ చేయడం, మరో ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ బ్యాట్‌ను గన్లా ఉపయోగించి సెలబ్రేషన్ చేసుకోవడం వంటి చర్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా, రౌఫ్‌కు జరిమానా విధించడం, ఫర్హాన్‌ను మందలించడం జరిగింది.
ప్రోటోకాల్ ఉల్లంఘనలు..
కేవలం హ్యాండ్‌షేక్ మాత్రమే కాదు, ఈ టోర్నమెంట్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి. ఫైనల్‌కు ముందు జరగాల్సిన కెప్టెన్ల ట్రోఫీ ఫొటో షూట్‌కు కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాజరు కాలేదు. అటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా మీడియా సమావేశాలను బహిష్కరించడం, భారతీయ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం వంటి ఘటనలు జరిగాయి.
ఫైనల్ మ్యాచ్ టాస్ సమయంలోనూ అనూహ్యంగా ఇద్దరు ప్రజెంటర్లు (రవిశాస్త్రి, వకార్ యూనిస్) కనిపించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది.
మొత్తం మీద, ఆసియా కప్ 2025 ఫైనల్ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్‌గా కాకుండా, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు, భౌగోళిక రాజకీయ ఘర్షణలకు వేదికగా నిలిచింది. క్రీడాస్ఫూర్తిని పక్కనపెట్టి, ఉద్రిక్త వాతావరణంలో ముగిసిన ఈ ఫైనల్ మరోసారి భారత్-పాకిస్తాన్ క్రికెట్ వైరుధ్యంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది..
రన్నరప్ చెక్కును అందుకున్న వెంటనే విసిరేసిన సల్మాన్ ఆగా.
పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. దుబాయ్‌లో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేశాడు. దీంతో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు, రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. సంజు శాంసన్ (24), శివమ్ దూబే (33)తో కలిసి తిలక్ చేసిన కీలక భాగస్వామ్యాలు పాకిస్థాన్ గెలుపు ఆశలను దూరం చేశాయి. ఈ టోర్నమెంట్లో భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడంతో ఆగా తీవ్ర నిరాశ చెందాడు..మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నరప్ చెక్కును అందుకున్న వెంటనే సల్మాన్ ఆగా ఆగ్రహంతో దానిని విసిరేశాడు. అయితే, అతని ఈ చర్యకు అక్కడున్న ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదురైంది…