_”గుప్తనిధులు”* పుస్తకం నుండి ఇంకో అంశం… ఇదే చివరిది.
భక్తి బేరం..
➖➖➖➖➖➖➖➖
*నేనొక ఊరికి వెళ్ళాను. ఆ ఊరి మధ్య ఒక మందిరం ఉంది. ఆ ఊరి జనం ధర్మాత్ములుగా పేరుపొందినవాళ్ళు. అందుకనే చూడ్డానికి వెళ్ళాను. జనం సాయంత్రం కల్లా గుడికి చేరేవాళ్లు, భజనలూ, ప్రార్థనలూ మొదలయ్యేవి. శక్తికొద్దీ దేవుణ్ణి ప్రార్థించి, కీర్తించి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు.*
*వాళ్లను నిశితంగా పరిశీలించాను. వాళ్ల ప్రవర్తనకు, ప్రార్థనకూ ఏమీ సంబంధం లేదన్న సంగతి తెలిసింది.*
*అనుదిన జీవితంలో అందరూ నిర్దయగా ఉండేవాళ్లు, ప్రార్థన నుంచి వాళ్లు అసలు ఏమీ నేర్చుకున్నట్లుగా కనిపించలేదు. భక్తి భక్తే.. బతుకు బతుకే..!*
*ఒకదాని ప్రభావం ఇంకోదానిమీద కనిపించదు. ధర్మమన్నది జీవితంలోకి అడుగు పెట్టడం కనిపించలేదు.*
*చివరికి తెలిసిందేమిటంటే.. అందరివీ అధర్మ జీవితాలే. పైకి మాత్రం సన్మార్గులుగా, భక్తులుగా కనిపిస్తున్నారు. తమ అధర్మాన్ని, తమలోపలి కపటాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్లు భక్తి అనే ముసుగును కప్పుకున్నారు. అది వాళ్లకెంతో అనుకూలంగా ఉంది. ఆలయాలు, పూజాగృహాలు వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.*
*అట్లా అని వాళ్లకు దైవంమీద ప్రేమ ఉందా? అంటే అదీ లేదు. ప్రేమ ఉన్నప్పుడు కోరికలుండవు. వాళ్లు భగవంతుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థన ఐహిక సుఖాల్లో భాగంగానే ఉంది. ప్రార్థన అంటే ప్రేమ, త్యాగం, కృతజ్ఞత. ఆ లక్షణాలు వాళ్లలో అణుమాత్రం లేవు. వాళ్లని చూస్తూంటే, నాకో కథ గుర్తుకు వచ్చింది.*
*ఒక హంతకుడికి ఉరిశిక్ష పడింది. నెల తరువాత అతన్ని ఉరి తీస్తారు. అంతవరకూ అతన్ని జైల్లో పెట్టారు. ఉరిశిక్ష విధింపబడినట్లు తెలియంగానే ఆ హంతకుడిలో అపూర్వమైన పరివర్తన కలిగింది.*
*అతనిలోని దుర్మార్గపు ప్రవర్తన హఠాత్తుగా అదృశ్యమై పోయింది. శాంతిమూర్తిగా మారిపోయాడు. ఉదయాన్నే లేచి పరిశుభ్రంగా తయారై, ప్రసన్నవదనంతో తోటి ఖైదీలకు, జైలు అధికారులకు అభివాదం చేసి భగవన్నామ స్మరణ మొదలుపెట్టేవాడు. రామనామ సంకీర్తనతో చెరసాల నిండిపోయేది. గొప్పగొప్ప తత్వగీతాలు ఆలపించేవాడు. అతని నిరంతర చింతన దైవమే అయిపోయింది. గొప్ప ప్రేమమూర్తిగా మారిపోయాడు. తోటి ఖైదీలతో ఎంతో దయగా ప్రవర్తించేవాడు.*
*ఉదయం మొదలు అతను ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లగా తోటి ఖైదీలందరూ అతని దగ్గరకు వచ్చి అతని పక్కన కూచునేవారు. వాళ్లుకూడా ప్రార్ధన అందుకునేవాళ్లు, వాళ్లు కూడా భక్తులుగా మారిపోయారు. నిత్య భజనలతో చెరసాల ఆలయ మయిపోయింది. అంత గొప్ప హంతకుడు ఇంత గొప్ప భక్తుడిగా మారిపోవడం చూసి జైలు అధికారి కదిలిపోయాడు. అతను కూడా హంతకుడి శిష్యుడయిపోయాడు.*
*అతను కూడా ఖైదీలతో బాటు కూర్చుని భజనలు చేసేవాడు. ఆ హంతకుడిలో వచ్చిన పరివర్తన పై అధికారులకు కూడా తెలిసింది. చెరసాలలు పరివర్తన శాలలుగా మారడం వాళ్లకు పరమానందం కలిగింది. జైలు అధికారి ఉదయాన్నే హంతకుడికి అభివాదం చేసి తన కార్యక్రమాలు ఆరంభించేవాడు. అతని అవసరాల్ని కనిపెట్టేవాడు. ఒకరోజు ఉదయం అంతా నిశ్శబ్ధంగా ఉంది.*
*జైలు అధికారి.. _”ఎందుకు ఇంకా అతను నిద్రలేచి ప్రార్ధన ప్రారంభించలేదు”_ అని ఖైదీల్ని అడిగాడు. ఖైదీలు అతనింకా నిద్ర లేవలేదన్నారు. జైలు అధికారి బహుశా ప్రార్థనలతో రాత్రి అలసిపోయాడనుకుని వెళ్లాడు. ఖైదీలు హంతకుడితో _”ఎందుకింకా మీరు ఈరోజు ప్రార్ధన ఆరంభించలేదు?”_ అని అడిగారు. దానికి హంతకుడు _“నాభక్తి బేరం కుదిరింది. నాలో మార్పు చూసి పై అధికారులు నా ఉరిశిక్ష రద్దు చేసి దాన్ని ఏడు సంవత్సరాల జైలు శిక్షగా మార్చారు. అనుకున్న పని పూర్తయింది. అమాయకుడయిన దేవుణ్ణి ఇంకా నేను ఇబ్బంది పెట్టదలచుకోలేదు”_ అన్నాడు.*
==================
ఈ “గుప్తనిధులు” అనే పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ఆణిముత్యాల్లాంటి కొన్నింటిని మాత్రమే ఏరి మీకు రుచి చూపించారు..
వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా..
*తండ్రీ!…👏*
*కూడగట్టు కున్న అజ్ఞానాన్ని జ్ఞానంగా భావించే గడుసు తనము నాది. అపజయాల పరంపరను విజయాల వెల్లువగా చేగొనే మూర్ఖత్వం నాది.*
*పనికి రాని వాటిని కూడ గట్టుకుంటూ గొప్ప వాడిగా భావించే వెర్రి తనము నాది బంధాలలో అనుబంధాలలో మమేకమవుతూ అదే అంతులేని ఆనందం అనుకునే పిచ్చి తనము నాది.*
*జనన మరణాల పరంపరలో జీవుల లక్ష్యము గమ్యము ఐన నీ సన్నిధికి దూరంగా చరించే మూర్ఖత్వం నాది.*
*అయినా నన్ను అక్కున చేర్చుకొని ఆదరించే దైవత్వం నీది.*
*⚜️శివోహం శివోహం శివోహం⚜️*..
*భగవద్గీతే దివ్య ఔషధం :*
*బంకించంద్ర ఛటర్జీ*
*ప్రఖ్యాత రచయిత ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసను దర్శించుకోగా, ‘నీ జీవన లక్ష్యం ఏమిటి? అనడిగారాయన. ‘కుటుంబ పోషణ’ అన్నారు బంకించంద్ర. పరమహంస తీవ్రంగా స్పందిస్తూ ‘ముల్లంగి తింటే ఆ త్రేన్పులే వస్తాయి. సంసారమే సర్వమని భావిస్తే ఆలోచనలు ఇలాగే ఉంటాయి’ అని, ఆధ్యాత్మిక జీవన ప్రాముఖ్యం గురించి చెప్పారు. పరమహంస సాంగత్యంతో బంకించంద్రుని ఆలోచనా ధోరణే మారిపోయింది. మనసు ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మికత వైపు మరలి, క్రమంగా వేదాంతిగా మారిపోయారు. లౌకిక కథనాలతో కూడిన సాహిత్యాన్ని వదిలేశారు. దైవచింతన పెంచుకుని ఆధ్యాత్మిక రచనలు చేస్తున్న రోజుల్లో ఒకసారి బంకించంద్ర తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అయినా శరీర అస్వస్థతను పట్టించుకోకుండా ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో లీనమయ్యారు. అప్పుడో ప్రముఖ వైద్యుడు వారి ఇంటికి వచ్చి ‘ఔషధం తీసుకోకపోతే ఎలా? ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకుంటారా?!’ అంటూ హెచ్చరించారు. దానికి స్పందిస్తూ బంకించంద్ర ‘మందులు తీసుకోకపోవటమేంటి! రోజూ ఒక ఔషధాన్ని వాడుతున్నానే!’ అన్నారు. వైద్యుడు ఆశ్చర్యంగా ‘ఏదీ చూపండి’ అనడిగారు. ‘ఇదిగో’ అంటూ చెంతనే ఉన్న భగవద్గీత చూపి, ‘పారమార్థిక అన్వేషణకే కాదు, ప్రాపంచిక రుగ్మతలకూ ఇంతకంటే దివ్య ఔషధం లేదు’ అన్నారు..
* జై శ్రీమన్నారాయణ
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*కల్యాణ దంపతులు*
*భారతీయతకు పునాది కుటుంబం. దానికి నాంది వివాహం. గౌరవప్రద హోదాను, ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టే విశిష్ట బంధం అది. దాన్ని మించిన పవిత్రత, ఆత్మీయత, స్నేహం, సంతోషం ప్రపంచంలో మరెక్కడా లభించవు. మహాభారతంలో యక్షుడు ‘పురుషుడికి నిజమైన నేస్తం ఎవరు’ అని ధర్మజుణ్ని ప్రశ్నిస్తాడు. ‘భార్యే అసలైన స్నేహితురాలు’ అని బదులిస్తాడాయన. ప్రేమలోని అమరత్వాన్ని, స్త్రీత్వంలోని మాతృత్వాన్ని, అంతర్యామిలోని దైవత్వాన్ని కలగలిపి కుటుంబానికి పంచిపెడుతుంది ఇల్లాలు. భర్తతో పాటు కుటుంబసభ్యులందరి అవసరాల్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నారు. ఈ జగతికి జీవనజ్యోతి ఆమె. భర్త అంటే అర్థం ‘భరించేవాడు’ అని మాత్రమే కాదు. బాధ్యత గలవాడే భర్త. అతడు ప్రేమను కుటుంబమంతటికీ పంచుతాడు. ఆదరణ కనబరుస్తూ, అందరి పోషణ బాధ్యతా వహిస్తాడు. వివాహం అనేది, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికే పరిమితమైనది కాదు.*
*జీవితాన్ని ఎంచుకోవడమే వివాహం. మహాత్మాగాంధీ బోధించినట్లు- ‘అన్నింటి కంటే జీవితం ఓ చక్కని కళ. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తే గొప్ప కళావేత్త’. ప్రతి ఒక్కరి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలా ఉండాలనుకున్నప్పుడు- సంతోషం పొందడానికి కాదు, దాన్ని ఇవ్వడానికే పెళ్లి చేసుకోవాలి. సంతోషాన్ని పంచే వ్యక్తే దాన్ని తప్పక పొందగలడు. పెళ్లిలోని ఏడడుగుల్లో- మొదటి అడుగు శారీరక శక్తికి, రెండో అడుగు మానసిక బలానికి. మూడో అడుగు- దంపతులు కలిసి బతకడానికైతే, నాలుగో అడుగు ఆయురారోగ్యాల కోసం. అయిదో అడుగు పశుసంపద కోసం, ఆరో అడుగు రుతు పవనాల సానుకూలత కోసం. ఏడో అడుగును సఖ్యత కోసం వేస్తారు. ఏడడుగులూ కలిసి నడుస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధనకే పెళ్లి. రెండు ఆత్మలూ మూడు ముడులతో ముడివడతాయి. పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి ఉండాలని; వాక్కు, అర్థంలా ఒక్కటిగా మెలగాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.*
*అనుకూలంగా, అనుగుణంగా ఉండేదే వివాహం. అలా కుదరడం అందరి విషయంలోనూ సాధ్యం కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు దూరమవుతాయి. ఇంకా కొన్ని మిగిలి ఉంటే, వాటికి సంబంధించి వీలైనంతవరకు సర్దుకుపోవడం ఓ సుగుణం. ఆ గుణం అహంకారాన్ని దూరంగా తరుముతుంది. పరిష్కారాన్ని చేరువకు తెస్తుంది. బంధాల్ని పదిలపరుస్తుంది. ప్రేమను పంచుతుంది. వివేకవంతులకు జీవితం ఒక పండుగ. హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలని అనుకోవడం సహజమే. అలా అనుకున్నప్పుడు ‘జీవిత భాగస్వామి తత్వమే మారాలి, తన తత్వాన్ని నేనే కచ్చితంగా మార్చితీరాలి’ అని పంతానికి పోవడంవల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. భాగస్వామి సరళిని ఏదోవిధంగా మార్చడమే పనిగా పెట్టుకోకుండా, తానే సవ్యమైన దృక్పథంతో మారగలిగితే మేలు. వివాహ సౌధాన్ని ప్రేమ, నమ్మకం, సహనం, త్యాగం అనే పునాదులపైనే నిర్మించుకోవాలి. అప్పుడు గృహమే స్వర్గసీమగా మారుతుంది.*
*దైవదత్తమైనది జీవితం. దానికి వరం ప్రేమ. ఆ ప్రేమకు సంతానమే ముద్దు. అందువల్ల దాంపత్య జీవితం ముద్దుముచ్చట్లతో సాగాలి. దంపతులు నిత్య నూతనంగా, సదా సంతోషంగా జీవనయాత్ర సాగించాలి. నవ వేదంలోని ముఖ్య సూత్రం అదే! ఓ వృద్ధజంటను వివాహ దినోత్సవ సందర్భంగా వూళ్లొవారు సన్మానించారు. వేదికమీద ఇద్దరినీ ఓ ప్రశ్న అడిగారు- ‘ఇన్నేళ్లూ మీ కాపురం ఇంత ఆనందంగా సాగడానికి కారణం ఏమిటి’ అని. ‘ఆమె నా భార్య కాదని అనుకోవడమే’ అన్నాడాయన! ‘ఆయన నా భర్త అని కలలోనైనా అనుకోలేదు’ అని బదులిచ్చిందామె! అందరూ నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం ఆగి, ‘మేమిద్దరం ప్రాణ స్నేహితులం అనుకున్నాం’ అని ఆ దంపతులు ఒకేసారి సమాధానమిచ్చారు. భారతీయ వివాహ వ్యవస్థలోని పరమార్థం అదే!*
..
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
*🥀మన సాహిత్య మకరందం🥀*
హరివిచిత్రహేమ కవచావృతు డున్నతచాపచారు దీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సెంద్రచాప శం
సారుచి మేఘమో యనగ బాండవ మధ్యముడొప్పి బద్ధ తూ
ణీరుడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నె చూడగన్. 6-17
అందమైన విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు. ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్లకలువల రంగులో తలతళలాడుతున్నాడు. పైరెండింటితో (విచిత్రహేమ కవచం, ఉన్నత చాపం) కలిసిన మొత్తం రూపం – హరివిల్లుతో, మెరపుతీగతో కలిసి ఉన్న నీలమేఘంలా ఉంది. వీపు మీద అటూ ఇటూ అంబులపొదులున్నాయి. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇలా వచ్చి రంగమధ్యమంలో నిలబడితే ప్రజల చూపులన్నీ అతడి మీదే నిలబడ్డాయి.
అర్జునుడి రూపంలో ఉన్న ఉదాత్తతనీ, వీరోచిత దర్పాన్నీ, ఉన్నతినీ ఈ పద్యం సూచిస్తోంది. సమాస నిర్మాణంలో ప్రయోజనం నెరవేరింది. నడకలో ఠీవి స్ఫురిస్తోంది. వేటిని స్పురింప చెయ్యాలన్నా కవి చేతిలో ఉన్న సాధనాలు శబ్దార్థాలు మాత్రమే కదా! వాటిని సద్వినియోగం చేసుకొని వాచ్యార్థం కన్నా లోతైన అంశాలు స్పురింపజేయగలిగిన వాడే మహాకవి.
అర్జునుడు నల్లగా ఉంటాడని ఈ పద్యంలో తెలుస్తోంది. “కఱ్ఱి విక్రమంబు కాల్పనే” అని ద్రౌపది ఉద్యోగపర్వంలో అంటుంది. కఱ్ఱి అంటే నల్లనివాడు అని అర్ధం. ద్రౌపది కూడా నలుపే. ‘కృష్ణ ‘ అని ఆవిడకి పర్యాయపదం. శ్రీకృష్ణుడు సరేసరి నీలమేఘశ్యాముడు. ఇలా పాండవ పక్షంలో ముఖ్యులు ముగ్గురు నల్లనివారు.
ఇంద్రధనుస్సుతో మెరుపుతీగతో కలిసిఉన్న మేఘంలా ఉన్నాడు అర్జునుడు. వర్షఋతువులో కనపడవచ్చు ఇటువంటి దృశ్యం. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఇంద్రచాపంతో కలిసిఉన్న మేఘంగా ఉత్ప్రేక్షించడం వల్ల అర్జునుడు ఇంద్రుని కుమారుడు అనే విషయం కూడా స్ఫురణకు వస్తుంది.
ఈ పద్యం నన్నయ భారతం లోనిది
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣