ట్రంప్ మళ్లీ అదే పాట.. భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే.
భారత పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై వాడివేడిగా చర్చ జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే, ఈపాటికి భారత్-పాక్‌లు యుద్ధంలో ఉండేవని అన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు.
“ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయి. నేనే లేకుంటే ఈపాటికి 6 పెద్ద యుద్ధాలు జరగుతూ ఉండేవి. ఇందులో భారత్- పాక్ ఘర్షణ అతిపెద్దది. ఎందుకంటే అవి రెండూ అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి లాంటి దారుణ పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆ ఇరుదేశాల నేతలు నాకు చాలా బాగా తెలుసు. యుద్ధం చేస్తే వారితో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని తేల్చి చెప్పాను. దీనితో భారత్-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయి.”
– డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు!.
భారత్- పాకిస్థాన్‌ల మధ్య చెలరేగిన ఘర్షణలను తానే ఆపానంటూ ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అమెరికా పాత్ర ఏమాత్రం లేదని భారత్ ఖండిస్తూ వస్తోంది. పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం చేశారు… ట్రంప్ ఎప్పుడూ ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై తెగ సెటైర్లు వేస్తున్నారు..