నా గుడ్ ఫ్రెండ్ మోదీకి ఫోన్ చేస్తా.. డీల్ సెట్ చేస్తా.. ట్రంప్ కీలక కామెంట్స్..ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ రియాక్షన్..
ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటన అమెరికాపై భారీగానే ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసివున్న ఫొటో షేర్ చేసి ట్రంప్.. భారత్‌తో పాటు రష్యాను కోల్పోయామన్నరు. ఈ క్రమంలో ఆయన మరోసారి కీలక కామెంట్స్ చేశారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత్‌పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు, ముఖ్యంగా రష్యా నుండి చమురు దిగుమతులపై, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే ట్రంప్ ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ, భారత్ పట్ల సానుకూలంగా స్పందించడం, సంబంధాలను మెరుగుపరచడానికి ఆసక్తి చూపుతున్నట్లు సూచిస్తోంది….ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ – అమెరికా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి చర్చలు జరుపుతున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడటానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ చర్చలు విజయవంతంగా ముగియడం ఇరు దేశాలకు పెద్ద కష్టమేమీ కాదు’’ అని ట్రంప్ అన్నారు..
ట్రంప్‌తో మాట్లాడేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా.. మోదీ..
భారత్, అమెరికా వాణిజ్య అడ్డంకుల తొలగింపులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు..తమ మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు మోదీ. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్‌లోని బృందాలు కృషి చేస్తున్నాయని, నేను కూడా ట్రంప్‌తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
భారత్‌పై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్ నిర్ణయం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కొంతవరకు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కానీ ట్రంప్ ఓవైపు సుంకాలు విధిస్తూనే, మరోవైపు ప్రశంసిస్తున్నారు. న్యూదిల్లీతోపాటు వాషింగ్టన్ సంబంధాలతోపాటు, మోదీని ప్రశంసించడం ఇది రెండోసారి. ఇప్పుడు మోదీ ట్రంప్ వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించడం గమనార్హం.