ట్రంప్,పుతిన్‌ల మధ్య అలాస్కా వేదికగా కీలక భేటీ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య అలాస్కా వేదికగా కీలక భేటీ జరిగింది. యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఇద్దరు ప్రపంచ నాయకులు భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు వీరి మధ్య భేటీ జరిగింది. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి…భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్, పుతిన్ మాట్లాడారు.. ఈ సందర్భంగా భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై వివరించారు. ట్రంప్ మాట్లాడుతూ.. భేటీ విజయవంతంగా ముగిసిందని, అనేక అంశాలపై చర్చ జరిపామని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందని, అయితే, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని ట్రంప్ చెప్పారు..
త్వరలో మరోసారి భేటీ..
చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్న ట్రంప్.. చాలా అంశాలను పుతిన్, నేను అంగీకరించామని చెప్పారు. అయితే, కొన్ని అంశాలపై మా మధ్య ఇంకా స్పష్టత రాలేదు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదని ట్రంప్ చెప్పారు. త్వరలో మరోసారి పుతిన్‌తో భేటీ అవుతానని పేర్కొన్నారు. త్వరలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు…