సూట్ ఎందుకు వేసుకోలేదు?.. మీరు కొద్దిగా తగ్గాలి..జెలెన్స్కీతో తేల్చి చెప్పిన ట్రంప్…
రష్యాతో ఉక్రెయిన్ రాజీ పడాల్సిందే.. జెలెన్స్కీతో తేల్చి చెప్పిన ట్రంప్.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ల మధ్య వైట్ హౌజ్ ఓవల్ ఆఫీస్ సమావేశంలో మీడియా ముందే తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది..అమెరికా నుంచి సహాయం పొంది కూడా తమకు కృతజ్ఞతగా లేరని జెలెన్ స్కీ పై ట్రంప్, వాన్స్ లు మండిపడ్డారు. ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకువెళ్తున్నారని ట్రంప్ జెలెన్ స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూట్ ఎందుకు వేసుకోలేదు?
ఈ సందర్భంగా ఓ విలేకరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని మీరు సూట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. యూఎస్ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా సూట్ ధరించాలి కదా.. మీకు అమెరికా అంటే గౌరవం లేదా?” అని రియల్ అమెరికాస్ వాయిస్ చీఫ్ వైట్ హౌస్ కరస్పాండెంట్ బ్రియాన్ గ్లెన్ ప్రశ్నించారు. “మీరు సూట్ ఎందుకు వేసుకోరు? మీకు సూట్ ఉందా? మీరు యూఎస్ అధ్యక్ష పదవిని గౌరవించకపోవడం చాలా మంది అమెరికన్లకు నచ్చడం లేదు” అని బ్లూ సూట్ ధరించిన బ్రియాన్ వ్యాఖ్యానించారు.
జెలెన్ స్కీ సమాధానం
ఈ ప్రశ్నకు సమాధానంగా జెలెన్ స్కీ ఆ రిపోర్టర్ వైపు కాసేపు చూసి, ”ఈ యుద్ధం ముగిసిన తర్వాత నేను ఆ కాస్ట్యూమ్ ధరిస్తాను. బహుశా మీ లాంటి సూటే ధరిస్తాను కావచ్చు. లేదా ఇంకా మంచిదాన్నే ధరిస్తాను కావచ్చు. నాకు తెలియదు. చూద్దాం. చౌకగా లభించేదైనా కావచ్చు’ అని జెలెన్స్కీ బదులిచ్చాడు. ఈ ఓవల్ ఆఫీస్ సమావేశం తర్వాత జెలెన్స్కీకి అమెరికా పట్ల ‘గౌరవం లేదు’ అని మాగా రిపోర్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “అతని వస్త్రధారణ మన దేశం పట్ల జెలెన్స్కీకి ఉన్న గౌరవం లేకపోవడానికి ప్రత్యక్ష ప్రతిబింబం.. అంతే” అని కామెంట్ చేశారు. కాగా, ట్రంప్ తో భేటీ సమయంలో జెలెన్ స్కీ నల్ల స్వెట్టర్ ధరించాడు. సాధారణంగా జెలెన్ స్కీ క్యాజువల్ వస్త్రధారణతోనే ఉంటాడు. ఇతర దేశాల అధినేతలతో సమావేశం అయిన సందర్భాల్లో కూడా ఆయన సాధారణ వస్త్రధారణతోనే వెళ్లారు..
జెలెన్స్కీపై మాట మార్చిన ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) నియంతలా వ్యవహరిస్తున్నారని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా తాను అలా అనలేదంటూ ట్రంప్ మాట మార్చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గురువారం ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జెలెన్స్కీ నియంత అని గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి గుర్తు చేశారు. దీనికి ట్రంప్ బదులిస్తూ, ‘నేను అలా అన్నానా? నేను అలా అన్నాను అంటే నమ్మలేకపోతున్నాను. జెలెన్స్కీతో నాకు మంచి సంబంధాలున్నాయి. శనివారం మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుందని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇన్నాళ్లు సఖ్యత గానే ఉన్న తెలుగు దేశాల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది..