లోబో దిబో అంటూ ఏడిస్తే ఏం లాభం అమెరికా.?

భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకోవడంతో అమెరికా భారత్‌పై సుంకాలు విధిస్తోంది. దీంతో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి..దీంతో అమెరికా,భారత వ్యాపార సంబంధాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాలు అన్వేషిస్తోంది. కొత్త దేశాలతో వ్యాపారా ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇండియా-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్‌ను మిత్రుడిగా చూడాలంటూ అమెరికా మాజీ రాయబారి వ్యాఖ్యానించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది అమెరికా తీరు.

పుతిన్ కు ఏమైంది? ట్రంప్ ని కలిసింది డూప్లికేటా?

ఇండియాపైనే ఆంక్షలు?
చైనా కూడా రష్యా నుంచి విస్తృతంగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, దానిపై అమెరికా ఒత్తిడి చూపకపోవడమే విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ ద్వంద్వ విధానం భారత్‌-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో భారత్‌-చైనా దగ్గరైతే అది అమెరికాకు తీవ్ర ముప్పుగా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్, చైనా అనైక్యత కారణంగానే అమెరికా ఆటలు సాగుతున్నాయన్నారు. ఇటీవల చైనా-భారత్‌ సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీ రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ను భాగస్వామిగా చూడాలి
భారత్‌తో తగాదాలు అమెరికాకే నష్టం చేస్తాయని, అది అమెరికాకు వ్యూహాత్మక పరాజయం అవుతుందని ఆ దేశ మాజీ రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించారు. చైనాను నియంత్రించాలని కోరే అమెరికా, అదే సమయంలో భారతదేశాన్ని ప్రత్యర్థిగా కాక ‘స్వేచ్ఛాయుత భాగస్వామి’గా చూడాలి అని సూచించారు. భారతదేశాన్ని ‘డెడ్‌ ఎకానమీ’గా అభివర్ణించిన వ్యాఖ్యలు తప్పని నిక్కీ హేలీ గుర్తు చేశారు. వాస్తవానికి, భారత్‌ స్థిరపడుతున్న మార్కెట్, దూసుకుపోతున్న వృద్ధిరేటు, ప్రపంచ వ్యాపారంలో ఉన్న అవకాశాలు – ఇవన్నీ కలిపి దానిని ఒక ప్రధాన శక్తిగా నిలబెడుతున్నాయని పేర్కొటున్నారు.

భారత్‌ పెరుగుతున్న ప్రాధాన్యం
వేగంగా పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో వస్త్రాలు, మొబైల్‌ ఫోన్లు, సౌర ప్యానెల్లు వంటి తయారీలో చైనాకు ప్రత్యామ్నాయం కల్పించే శక్తి భారత్‌కు ఉంది. అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో భారత సైనిక భాగస్వామ్యం బలపడుతోంది. మధ్యప్రాచ్యంలో ఆదరణ పెరగడంతోపాటు, ప్రపంచ జనాభాలో అగ్రస్థానంతో భారత్‌ ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉంది.

అమెరికా తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలంటే భారతదేశాన్ని కోల్పోవకూడదు. వాణిజ్య మనస్పర్థలు ఎంత ఉన్నా, భవిష్యత్తు శక్తి సమీకరణాల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుంది.