టీటీడీ విజ్ఞప్తి.. కొన్ని రోజుల పాటు తిరుపతి స్వామివారి దర్శనం వాయిదా వేసుకోండి..!!!

శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుల‌కు టీటీడీ శ‌నివారం
ఓ విజ్ఞ‌ప్తి చేసింది. కొద్ది రోజుల పాటు తిరుమ‌ల ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాలంటూ భ‌క్తుల‌కు టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. శ‌నివారం సాయంత్రానికే తిరుమ‌ల‌కు రికార్డు స్థాయిలో భ‌క్తులు చేరుకున్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్ మెంట్ల‌న్నీ నిండిపోయాయి. ఫ‌లితంగా స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నానికి ఏకంగా 48 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది.
ఈ ప‌రిస్థితిని భ‌క్తుల‌కు వివ‌రిస్తూ ధ‌ర్మారెడ్డి శ‌నివారం రాత్రి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుమ‌ల‌లో ప్ర‌స్తుతం ఉన్న ర‌ద్దీ త‌గ్గేందుకు క‌నీసం 2 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఆ మేర‌కు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఇప్ప‌టికే తిరుమ‌ల‌కు చేరుకున్న భక్తుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, మ‌రింత మంది పెరిగితే అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. భారీ ర‌ద్దీతో భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌.. అదే జ‌రిగితే త‌గినంత ఏర్పాట్లు చేయ‌లేదంటూ టీటీడీపై నింద‌లేస్తార‌ని తెలిపారు.