కరువును రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న బీఆర్‌ఎస్
కృష్ణా, గోదావరి జలాల మళ్లింపుపై అసత్య ప్రచారం చేస్తున్నారు ..
కాంగ్రెస్ హయాంలో జల వినియోగం, సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ పెరిగాయి
జనవరి 31లోగా పులిచింతల తీరంలోని 15 గ్రామాల పరిధిలో 10 వేల ఎకరాలకు కృష్ణా జలాలు అందించాలి..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలకవీడు,
కరువును రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తే ముప్పున్న వేళ రైతులకు అండగా నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్షం వారి కష్టాల నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.
బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి పలు ఎత్తిపోతల పథకాల పనులతో పాటు యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణాన్ని పరిశీలించారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పలువురు అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలో పెరిగిన జల వినియోగం
‘‘2023 డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ కృష్ణా, గోదావరి జలాలను బీఆర్‌ఎస్ హయాం కంటే ఎక్కువగా వినియోగించుకుంది.
సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని మళ్లిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగంలో పేరుకుపోయిన సమస్యలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్ల ద్వారా రైతులకు సుమారు రూ.90 వేల కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రవేశపెట్టామని వివరించారు.
జనవరి 31లోగా 10 వేల ఎకరాలకు కృష్ణా జలాలు
పులిచింతల జలాశయం తీర గ్రామాల రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని జనవరి నెలాఖరులోగా ప్రారంభిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. సవరించిన ఆయకట్టు పరిధిలోని 10 వేల ఎకరాలకూ 2027 జనవరి 31 నాటికి కృష్ణా జలాలు అందించాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.
‘‘ఈ పనులను పలమార్లు పరిశీలించాను. ప్రతిసారీ గడువు మారుతోంది. ఇకపై అలా జరగకూడదు. జనవరి నెలాఖరులోగా మొత్తం 10 వేల ఎకరాలకూ నీరు చేరాలి’’ అని తేల్చిచెప్పారు.
గడువు తప్పితే కఠిన చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు. కళ్లెదుటే కృష్ణా నది ప్రవహిస్తున్నా దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోని వేలాది రైతు కుటుంబాలకు ఈ పథకంతో ఊరట లభిస్తుందని, ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఈ పథకంతో జాన్‌పహాడ్, పాలకవీడు, కోమటికుంట, ఓతులపాలెం, ఎల్లాపురం, సజాపురం, హనుమాయగూడెం, నాగిరెడ్డిగూడెం, గుడుగుంట్లపాలెం, గుండ్లపహాడ్, చెరువుతండా, అలింగాపురం, గుండెబోయినగూడెం, రాఘవాపురం, మిగడంపాడు తండా గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది.
పంపులు, మోటార్లు ఇప్పటికే పనుల ప్రదేశానికి చేరాయని, పంప్‌హౌస్ పనులు తుది దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
డిసెంబరు నెలాఖరులోగా పంప్‌హౌస్, జనవరి నెలాఖరులోగా విద్యుత్ ఉపకేంద్రం పనులు పూర్తి చేసి, నిర్ణీత గడువులో పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. కల్మల తండా వైపు నీరు అందించేందుకు బుడ్డారపాలెం వద్ద కిలోమీటరు మేర కాలువ అనుసంధాన పనులు పూర్తి చేయాలన్నారు. జాన్‌పహాడ్, మునిమోపుల, తుమ్మల సహా ఆరు చెరువులను ఈ పథకం ద్వారా నింపనున్నట్లు వివరించారు.
జాన్‌పహాడ్ తన ప్రాధాన్య పథకాల్లో ఒకటని ఉత్తమ్ చెప్పారు. కృష్ణా నదికి చేరువలో ఉన్నా ఇన్నాళ్లూ సాగునీరు అందని భూములకు నీటిని ఎత్తిపోయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. ముక్తేశ్వరం సహా స్థానిక ఎత్తిపోతల పథకాలు రైతు కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురాగలవని పేర్కొన్నారు.
యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయండి
ఎల్‌నినో ప్రభావంతో రాబోయే యాసంగిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశముందని ఉత్తమ్ తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, సాగునీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా అందుబాటులో ఉన్న జలాలను సమర్థంగా వినియోగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు.
ఆహార కొరత తలెత్తకుండా ప్రజాపంపిణీకి అవసరమైన సన్నబియ్యం సహా తగిన ఆహార ధాన్యాల నిల్వలను సిద్ధం చేసినట్లు తెలిపారు.