మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్. స్టీఫెన్‌సన్ (Elvis Stephenson) సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదనపు వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని ఆయన కోరారు..స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను భారత ప్రధాన ధర్మాసనం (CJI Bench) పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన సీజేఐ ధర్మాసనం.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన శాసనమండలి (MLC) ఎన్నికల సమయంలో ఈ ‘ఓటుకు నోటు’ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్‌ను తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ.. రేవంత్ రెడ్డి భారీగా నగదు ఆశ చూపారనే ఆరోపణలతో పాటు లావాదేవీలకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏసీబీ విచారణ, హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలు కావడం, రాజకీయంగా తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగా, తాజాగా స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.