వారణాసి’…సినిమా విడుదలకు ముందే సరికొత్త చరిత్ర…!

టాలీవుడ్‌లో సినిమా బిజినెస్ అంటే ఇప్పటివరకు ఓ లెక్క.. రాజమౌళి సినిమా వస్తే మరో లెక్క! ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి నిరూపించేందుకు సిద్ధమవుతోంది సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’…సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే బిజినెస్ విషయంలో ఈ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం జరిగిన భారీ ఒప్పందం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విడుదలకు ముందే రికార్డుల వేట!

తాజా సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ.300 కోట్ల భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. అయితే ఇందులో రూ.15 కోట్లను రికవరబుల్ అమౌంట్‌గా పరిగణిస్తుండగా, నికర డీల్ విలువ రూ.285 కోట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లింపులు కూడా పూర్తయ్యాయని, ఒప్పందం అధికారికంగా ముగిసిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కలు నిజమైతే తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ థియేట్రికల్ హక్కుల ఒప్పందాల్లో ‘వారణాసి’ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి వ్యాపారం జరగడం సాధారణ విషయం కాదు…

మైత్రీ మూవీస్‌కు ఇదొక భారీ సవాల్ కూడా!

రూ.285 కోట్ల నికర డీల్ అంటే హక్కులు దక్కించుకోవడంతోనే పని పూర్తయినట్లు కాదు. థియేటర్లలో సినిమా సాధించాల్సిన వసూళ్లపై కూడా భారీ అంచనాలు ఏర్పడతాయి. పంపిణీదారుడికి లాభాలు రావాలంటే ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో స్పందన రావాల్సి ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం మైత్రీ మూవీ మేకర్స్‌కు ఎంతటి అవకాశమో.. అంతటి బాధ్యత కూడా..