తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశానికి ఆహ్వానం పంపింది. ఈనెల 16న మధ్యాహ్నం రెండున్నర గంటలకు దిల్లీలోని శ్రాంశక్తిభవన్ వేదికగా నిర్వహించనున్న సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందో? లేదో తెలపాలని సీఎంలను కోరింది.
వీలవుతుందో లేదో చెప్పండి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు, ఎల్లుండి దిల్లీలో పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 16,17 తేదీల్లో దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇద్దరు సీఎంలు 16వ తేదీన దిల్లీలోనే ఉండనున్న నేపథ్యంలో సమావేశానికి రావడానికి వీలయ్యేదీ, లేనిదీ తెలియజేయాలని కేంద్ర జలశక్తి శాఖ సమాచారం పంపింది. చర్చించాల్సిన అంశాల అజెండా వివరాలను ముందుగానే తమకు అందించాలని సూచించింది.
కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : ఈ ఏడాది ఫిబ్రవరి 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు పూర్తి ప్రతిపాదనలను వివరించారు. 200 టీఎంసీల వరద నీటిని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటు తదితర వివరాలను చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి : అయితే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ పార్టీలు, నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరగనున్న సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడనుంది. మరోవైపు కృష్ణా, గోదావరిలో వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సాగునీటి శాఖ అధికారులకు సూచించారు.
మంత్రి ఉత్తమ్ లేఖ : గతంలో జరిగిన అన్యాయానికి శాశ్వత పరిష్కారాలు సాధించాలన్నారు. ఈనెల 16న దిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై నీటి వాటాల సాధన, ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల సాధించడానికి పట్టుబట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం సూచనలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ : ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టుపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కేవలం సముద్రంలో కలిసే వరద నీటిని మాత్రమే వాడుకుంటామని చెబుతున్నారు. ఈ భేటీలో జల వివాదాలకు సంబంధించిన అంశాలన్నీ చర్చకు రానున్నట్లు సమాచారం.