మానవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్ ను గుర్తించి శరీరాన్ని అప్రమత్తం చేసే రక్షణ వ్యవస్థను హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్ఐఆర్–సీసీఎంబీ) సైంటిస్టులు కనుగొన్నారు. కణాల్లో వైరస్ దాడిని ముందే పసిగట్టి ఇమ్యూన్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసే వైరల్ అలారం స్విచ్ లా పనిచేసే ‘డీజిప్ 3(డాజ్ ఇంటరాక్టింగ్ జింక్ ఫింగర్ ప్రొటీన్ 3–DZIP3)’ అనే స్పెషల్ ప్రోటీన్ ను రీసెర్చర్లు గుర్తించారు…వైరస్ జెనెటిక్ మెటీరియల్ ను నేరుగా గుర్తించడంతో పాటు, ఇతర కీలక కణ ప్రోటీన్లను ట్యాగ్ చేసి ఇమ్యూన్ అలారం మోగించే డ్యూయల్ రోల్ ప్రోటీన్లు బాడీలో ఉంటాయని ఏడేళ్ల క్రితమే ప్రతిపాదించిన సీసీఎంబీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ చౌహాన్ టీమ్.. తాజాగా ఆ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించింది. డాక్టర్ రింకూ సాహు ఫస్ట్ ఆథర్ గా వ్యవహరించిన ఈ అధ్యయనం‘ది ఎంబో జర్నల్’లో ప్రచురితమైంది. ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ఫండింగ్ సమకూర్చింది.
వైరస్ విస్తరణకు బ్రేక్…
కణంలోకి వైరస్ ప్రవేశించగానే దానిలోని వైరల్ ఆర్‌ఎన్‌ఏను డీజిప్ 3 ప్రోటీన్ పసిగడుతుంది. అలా గుర్తించిన వెంటనే తన షేప్ ను మార్చుకుని స్వయంగా యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత కణాల ఎనర్జీ ఫ్యాక్టరీలైన మైటోకాండ్రియా వద్దకు చేరుకుని, అక్కడ ఉండే ప్రధాన రక్షణ ప్రోటీన్లు ఆర్ఐజీఐ(రెటినోయిక్ యాసిడ్-ఇండ్యూసిబుల్ జీన్), ఎంఏవీఎస్ (మైటోకాన్డ్రియల్ యాంటీవైరల్ సిగ్నలింగ్ ప్రోటీన్)లతో జతకడుతుంది.
ముఖ్యంగా ఆర్ఐజీఐ ప్రోటీన్ దెబ్బతినకుండా స్థిరత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల కణంలో ఒక పవర్ ఫుల్ ఇమ్యూన్ రెస్పాన్స్ మొదలై, వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా అడ్డుకునే టైప్-1 ఇంటర్‌ఫెరాన్లు అనే రక్షణ కారకాలు విడుదలవుతాయి.ఫలితంగా వైరస్ శరీరంలో మరింతగా విస్తరించకుండా ఆగిపోతుంది.