30 రోజులు జైళ్లో ఉంటే.. పీఎం, సీఎం, మంత్రులెవ‌రైనా.. ప‌ద‌వి పోయినట్లే..!

లోక్‌సభలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకర సవరణ బిల్లు, యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది..ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు నేరారోపణలపై అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే వారిని పదవుల నుంచి తొలగించే అవకాశాలు ఈ బిల్లులు కల్పిస్తాయి..భారత రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు, 2025; యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2025; జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2025ను పార్లమెంట్‌ జాయింట్ కమిటీకి పంపిస్తున్నాం” అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు.

పెద్దఎత్తున నిరసన..
ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ బిల్లులు రాజ్యాంగంతో పాటు సమాఖ్యవాదానికి వ్యతిరేకమని ప్రతిపక్ష నేతలు అన్నారు..లోక్‌సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్‌ ముక్కలు విసిరారు.

దీంతో మొదట స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు…ఆ తరువాత లోక్‌సభ అమిత్ షా ప్రవేశపెట్టిన మూడు బిల్లులను జాయింట్ కమిటీకి పంపాలని తీర్మానం ఆమోదించింది. అనంతరం సభను సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు..