గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ప్రాంతీయ నేపథ్యాలు, యాసలను ప్రముఖంగా చూపిస్తూ సినిమాలను ప్రమోట్ చేయడం ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. అలాగే సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు ప్రాంతాల వారీగా విడిపోయిన ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుని అంతిమంగా సినిమాల ఫలితాలనే మార్చేస్తున్నారు. అయితే కళకు సరిహద్దులు గీయడంపై సీనియర్ నటుడు వీకే నరేష్ తనదైన శైలిలో గళమెత్తారు. ప్రఖ్యాత బుర్రకథ కళాకారిణి జీవితం ఆధారంగా రూపొందిన ‘ గరివిడి లక్ష్మి ’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి…ఈ వేడుకలో నరేష్ మాట్లాడుతూ.. “ఇటీవల చిత్ర పరిశ్రమలో తెలంగాణ సినిమా, రాయలసీమ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా అంటూ ముద్రలు వేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. ఆ ఫ్యాషన్‌ను పక్కనపెట్టి, ప్రేక్షకులు స్వచ్ఛమైన ‘ప్యాషన్’తో ఈ చిత్రాన్ని ఆదరిస్తారు. పాటలకు, సంగీతానికి ఎలాగైతే సరిహద్దులు ఉండవో, సినిమాకు కూడా ఎలాంటి ప్రాంతీయ భేదాలు ఉండవు. మనం పరభాషా చిత్రాలైన కొరియన్, మలయాళ, తమిళ సినిమాలను చూసి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి అభినందిస్తున్నప్పుడు, మన సొంత భాషా చిత్రాలను ప్రాంతాల వారీగా విభజించి చూడటం సరికాదు” అని స్పష్టం చేశారు.
“గతంలో తమిళంలో ‘మణ్ వాసనై’ (మట్టి వాసన) పేరుతో అద్భుతమైన సినిమా వచ్చింది. మట్టి వాసన అనేది కేవలం ఏదో ఒక ప్రాంతానికో, భాషకో పరిమితమైంది కాదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకించి తెలుగు నేలపై జన్మించిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మన మట్టి సువాసనను గుర్తుచేస్తుంది. ఇందులో ఉన్న నిజాయితీయే అసలైన వినోదం. ఇది ప్రాంతీయతను దాటి ప్రతి తెలుగు హృదయాన్ని హత్తుకుంటుంది” అని నరేష్ పేర్కొన్నారు..