పాస్‌పోర్టులో తేడాలు.. సీజేపీ నేత సౌరవ్దాస్పై లుకౌట్ నోటీసు.
సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ (Saurav Das) పాస్‌పోర్టులో లోపాల వ్యవహారం ముదురుతోంది. ఇటీవల ఆయన యూకేలోని ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా.. అతడిని అడ్డుకొన్నారు. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు.
ఈ నేపథ్యంలో సౌరవ్దాస్పై లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం దిల్లీ న్యాయస్థానానికి వెల్లడించింది. అతడి పాస్‌పోర్టు రికార్డుల్లో స్కూలింగ్, చిరునామా, పేరెంట్స్‌కు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పక్షాన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన శర్మ కోర్టులో హాజరై సమాచారమిచ్చారు. ఈ నెల 23న ముంబయి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
తమ క్లయింట్‌పై ఎల్వోసీ జారీ అయిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని దాస్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. సౌరవ్ దిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాతే షోకాజ్ నోటీసులు అందుకొన్నట్లు కోర్టుకు తెలిపారు. లుకౌట్ నోటీసులు అతడికి అందజేయలేదని పేర్కొన్నారు. ఎల్వోసీ జారీచేయడానికి కారణాలను తెలపాలని, ఆ ఉత్తర్వుల కాపీ ఇవ్వాలని దాస్ న్యాయవాదులు కోరారు.
యూకేలోని ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సౌరవ్ దాస్ ఇటీవల బయలుదేరి వెళ్తుండగా.. దిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పందిస్తూ.. సౌరవ్ పాస్‌పోర్టులో పేర్కొన్న వివరాల్లో వ్యత్యాసాలున్నట్లు అధికారులు గుర్తించారని, ఈ క్రమంలోనే నవంబర్ 23న ఆయనకు నోటీసులు జారీ చేశారని చెప్పారు.
దీప్కే, రాంకాలపైనా లుకౌట్
సౌరవ్ దాస్తోపాటు సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోశ్ రాంకాలపైనా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున నగరంలోని దాదర్ శివాజీ పార్క్ వద్ద నిరసనలు చేపట్టారని, ఇందుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ కారణంగా వారికి ఎల్ఓసీ జారీ చేసినట్లు పేర్కొన్నారు.