జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అక్రమాస్తుల వ్యవహారంలో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం సీబీఐ నమోదు చేసిన కేసులపైనే విచారణ చేపడుతున్న న్యాయస్థానం, ఇకపై దానితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కూడా ప్రతిరోజూ విచారించాలని భావిస్తోంది. గత దశాబ్దకాలంగా ఈడీ దాఖలు చేసిన పలు ఛార్జిషీట్లు, డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లోనే ఉండిపోవడంతో కేసుల పురోగతిలో తీవ్ర జాప్యం జరుగుతోందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ చొరవ చూపింది.సీబీఐ కోర్టులో పదేళ్లుగా దాదాపు 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్‌లో ఉండటం, నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ అధికారులు ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. తమ కేసులను కూడా త్వరితగతిన తేల్చేలా సీబీఐ కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఈడీ చేసిన విన్నపంపై స్పందించిన న్యాయస్థానం తాజా నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు రోజువారీ విచారణకు సిద్ధమై హాజరుకావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు సీబీఐ కోర్టు సూచించింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే సోమవారం నుంచే ఈడీ కేసులపై సుదీర్ఘ రోజువారీ విచారణ ప్రారంభమయ్యే అవకాశం..