నేహా బోరా అరెస్ట్..

నేహా బోరా అరెస్ట్..

దిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. వారం రోజుల్లో దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన గతవారం ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చారు.
విమానం ఢిల్లీలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు…

సీజేపీ లెహ్రా దో తిరంగా పిలుపు మేరకు ఢిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు అనుమతి లేకపోవడంతో ఐసా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, పంకజ్ భట్టాచార్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. అటు పోలీసులు, ఇటు మీడియా.. మధ్యలో దీప్కే మద్దతుదారులతో ఈ ప్రదేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీప్కేను పోలీసులు అరెస్టు చేసి, తమ వాహనంలో తీసుకుని వెళ్లారు. అంతకుముందు దీప్కేకు ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు నోటీసులు ఇచ్చారు. సెంట్రల్ పార్క్‌ వద్ద దీక్షకు వెళ్లకూడదని సూచిస్తూ.. ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద పోలీసులు ఒక నోటీస్ జారీ చేశారు. అనంతరం.. బీఎన్‌ఎస్‌ సెక్షన్ 163 కింద సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు మరో నోటీస్ జారీ చేశారు.

ఈ సమయంలో దీప్కే నివాసం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. తన అరెస్టు సమయంలో దీప్కే పోలీసులతో ఘర్షణకు దిగారు. సెంట్రల్ పార్క్ వద్ద ఆందోళన చేయడానికి వీల్లేదన్న పోలీసులతో.. మరో చోటును చూపించాల్సిందిగా కోరాడు. మరో ప్రదేశం గురించి తర్వాత చెబుతామని, ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. తానేమీ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని, తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఈ రోజు నిరసన జరగాల్సి ఉన్న కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌ను పోలీసులు మూసివేశారు. పార్క్ వద్ద ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ రెండు రోజులక్రితం ఢిల్లీ పోలీసులు సీజేపీ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తిహార్ జైలులో ఉన్నారు…

NDMC అనుమతి లేదు
ఢిల్లీలోని ప్రధాన వాణిజ్య ప్రాంతమైన కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు అందులో పేర్కొన్నారు.

ప్రతిపాదిత తిరంగా యాత్రకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అయినప్పటికీ ర్యాలీ నిర్వహిస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుందని హెచ్చరించారు.

గాంధీజీ చిత్రమున్న తెల్లటి టీషర్ట్, జీన్స్ ధరించిన దీప్కేకు పోలీసులు మరో విషయాన్ని కూడా వివరించారు.

జాతీయ జెండాను ప్రదర్శించడం చట్టవిరుద్ధం కాదని, అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించడం నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాతీయ జెండాను గౌరవిస్తూ, ఫ్లాగ్ కోడ్ నిబంధనలను పాటించాలని దీప్కేకు సూచించారు.