నర్మదా నది ఒడ్డున వందలాది ఓటర్ ఐడీ కార్డులు.. ఎఫ్‌ఐఆర్, విచారణకు కాంగ్రెస్ డిమాండ్!
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మండలేశ్వర్ వద్ద నర్మదా నది ఘాట్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు కనిపించాయి. ఆదివారం ఉదయం పరిశుభ్రత కార్యక్రమం సందర్భంగా ఇవి బయటపడ్డాయి. పోలీసులు 343 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇవి ఇండోర్‌లోని రావు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు చెందినవి. దీనిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, నిష్పాక్షిక విచారణ జరపాలని, నదిలో డైవర్లతో గాలించాలని డిమాండ్ చేసింది. కార్డులు ఎలా అక్కడికి చేరాయో దర్యాప్తు చేస్తున్నారు..
లభ్యమైన ఈ కార్డుల్లో చాలావరకు ఇండోర్ లోని రావు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవి. అన్ని కార్డులు అక్కడ ఎందుకు, ఎవరు పడేశారో తెలియరాలేదు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ఓటరు ఐడీ కార్డులను సేకరించారు. కార్డులు దొరికిన విషయాన్ని మహేశ్వర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిర్ధారించారు. దీనిపై విచారణకు ఒక తహశిల్దార్‌ను నియమించినట్టు చెప్పారు.