చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు
బస్సు వెనుక టైర్ కింద పడటంతో విరిగిన రెండు కాళ్లు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ…
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక
తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన మౌనిక..
దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన వైనం..
ప్రయాణికులు, స్థానికులు ప్రవళికను ఆసుపత్రికి తరలించగా, మౌనికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు..
“అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి మణుగూరు వద్ద భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. కుమారుడికి రూ. 10 టికెట్ కోసం రూ. 100 నోటు ఇవ్వగా, డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ ప్రవళిక టికెట్ జారీ చేసి మిగతా రూ. 90 చిల్లరను టికెట్ వెనుక రాసి తర్వాత ఇస్తానని చెప్పారు. అయితే తనకు ఇప్పుడే చిల్లర ఇవ్వాలంటూ మౌనిక తీవ్ర వాగ్వాదానికి దిగి గొడవ సృష్టించింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో బస్సు ఆగే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన మౌనిక, బస్సు డోర్ వద్ద ఉన్న కండక్టర్ ప్రవళికను ఒక్కసారిగా బయటకు తోసేసింది..
దీంతో కండక్టర్ ప్రవళిక అదుపుతప్పి కిందపడగా, బస్సు వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయి ఎముకలు విరిగాయి. రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న కండక్టర్‌ను గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో మణుగూరు, ఆపై భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు నిందితురాలు మౌనికను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటి మహిళ అని కూడా చూడకుండా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిపై ఇంతటి కర్కశత్వానికి పాల్పడటంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.”