ఆరుబయట ఇకపై పైపు పెట్టి నీళ్ళు కొడితే ఫైన్ పడినట్లే..!

భాగ్యనగరంలో ఒక్క నీటి చుక్కను వృథా చేసినా జలమండలి ఇక జరిమానాలతో విరుచుకు పడనుంది. తాగు నీటిని అనవసరంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వాటర్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా ఉన్న నీటి వనరులను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై జలమండలి ఉక్కుపాదం మోపుతోంది. నీటిని వృథా చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేస్తోంది…హైదరాబాద్ మహా నగరంలో నీటిని వృథా చేస్తే జరిమానా విధించేందుకు వాటర్ బోర్డు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తుంది. తాగునీటేతర అవసరాలకు మంచినీటి వినియోగం, శుద్ధి జలాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా కఠినంగా కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపింది. నీటి దుర్వినియోగంపై ఫిర్యాదులు చేసేలా ప్రత్యేక యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది…యాప్లో నీటి వృథాకు సంబంధించిన ఫొటోలు, లొకేషన్‌ను అప్‌లోడ్‌ చేస్తే వెంటనే జలమండలి స్పందించి వివరాలను ఆరా తీసి, వారికి జరిమానా విధిస్తుంది. వాటర్‌ బిల్లుతో పాటు ఫైన్ను కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నీటి వృథా జరిగినప్పుడు దానిపై ఫిర్యాదు చేసేవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌ రెడ్డి తెలిపారు..