తవ్వకాల్లో 1.2 కిలోల బంగారు గడ్డ..విలువ రూ.2 కోట్ల వరకు!
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో మెటల్ డిటెక్టర్‌తో అన్వేషిస్తున్న ఓ వ్యక్తికి 1.2 కిలోల బరువైన బంగారు గడ్డ దొరికింది. ఇందులో సుమారు 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.1.5–2 కోట్ల వరకు ఉంటుందని అంచనా…
వ్యక్తి టిబూబురా ప్రాంతంలోని మౌంట్ స్టువర్ట్ స్టేషన్ పరిసరాల్లో చాలా రోజులుగా అన్వేషిస్తున్నాడు. నిరాశే ఎదురవుతున్న తరుణంలో, ఒక రోజు అలసిపోయి పని ఆపేద్దాం అనుకున్న సమయంలో అతని మెటల్ డిటెక్టర్ గోల్డ్ మాన్స్టర్ 2000 నుండి విభిన్నమైన శబ్దం వచ్చింది. మొదట పెద్దగా సిగ్నల్ రాకపోయినా, కొద్ది దూరంలో మట్టిని తొలగించి చూసేసరికి అక్కడ ఒక మెరిసే వస్తువు కనిపించింది. మట్టిని పూర్తిగా శుభ్రం చేసి చేతిలోకి తీసుకున్న తర్వాతే అది స్వచ్ఛమైన బంగారు గడ్డ అని అతనికి అర్థమైంది. తన కళ్లను తానే నమ్మలేకపోయిన ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
విలువ, ప్రత్యేకతలు.
నిపుణుల పరిశీలన ప్రకారం, ఈ 1.2 కిలోల బరువైన బంగారు గడ్డలో సుమారు 940 గ్రాముల వరకు స్వచ్ఛమైన బంగారం ఉంది. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ దాదాపు 150,000 నుండి 160,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, అనగా భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన బంగారు గడ్డకు టిబూబురా స్పౌడ్ అని పేరు పెట్టారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో బంగారు గడ్డలు దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక నిపుణులు పేర్కొన్నారు. ఈ అరుదైన అదృష్టాన్ని పొందిన ఆ వ్యక్తి, ఈ బంగారాన్ని పురాతన వస్తువుల కలెక్టర్లకు విక్రయించే యోచనలో ఉన్నాడు..