అండాల బిజినెస్‌..బేగంపేట ప్రకాష్‌నగర్‌లో బయటపడ్డ అండాల అక్రమ దందా.. !

అండాల బిజినెస్‌.. బేగంపేట ప్రకాష్‌నగర్‌లో బయటపడ్డ అండాల అక్రమ దందా.. హైదరాబాద్‌లో గర్ల్స్‌ హాస్టల్‌ పేరుతో నడుపుతున్న గలీజ్‌ దందా గుట్టురట్టు అయింది. బేగంపేటలో యువతుల అండాల సేకరణ ముఠా వ్యవహారం బట్టబయలు అయింది. బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసుల సంయుక్తంగా దాడుల్లో 10మంది యువతులు అడ్డంగా బుక్కవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ బేగంపేటలో యువతుల అండాల అక్రమ సేకరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్‌నగర్‌లోని నజ్రాన్‌ అపార్ట్‌మెంట్‌లో గలీజ్‌ వ్యవహారం సాగుతున్నట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో బేగంపేట పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ దారుణ వ్యవహారం బయటపడింది. పోలీసులకు 10మంది యువతులు పట్టుబడటం సంచలనం రేపింది. వీరిని బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశాకు చెందిన యువతులుగా గుర్తించి.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పురుషుల వీర్యకణాలు కూడా..!

ఏడాది కాలంగా ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరిట ఈ అపార్ట్​మెంట్​లో అద్దెకు తీసుకుని దందాను నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అమ్మాయిలకు వివిధ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ అండాలను సేకరించి, సంతానం లేని దంపతులకు చికిత్స అందించే ఫెర్టిలిటీ కేంద్రాలకు భారీ మొత్తాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. అండాల సేకరణే కాకుండా, వీర్యకణాలను కూడా అక్రమంగా సరఫరా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులు పెట్టుకుని ఈ దందా సాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అపార్ట్​మెంట్​ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. డీసీపీ శ్రీధర్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, సీఐ సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ రాకెట్ వెనుక ప్రముఖ దవాఖానలు, డాక్టర్ల ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులు త్వరలోనే వెల్లడిస్తారని డీసీపీ స్పష్టం చేశారు. ..

అంతా బయట రాష్ట్రాల యువతులేనని తెలిపారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పక్కన అపార్ట్‌మెంట్లో పోలీసులు దాడులు చేయడంతో ఆందోళనకు గురయ్యామన్నారు స్థానికులు. తీరా చూస్తే.. కొంతమంది యువతులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందని చెప్పారు. మొత్తంగా.. హైదరాబాద్‌లో మరోసారి అండాలు, వీర్యకణాల అక్రమ సేకరణ దందా గ్యాంగ్‌ గుట్టు రట్టయింది. గర్ల్స్ హాస్టల్ పేరుతో యువతుల అండాలను సేకరించి.. ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న ముఠా బండారాన్ని బేగంపేట పోలీసులు బట్టబయలు చేయడం సంచలనంగా మారింది.