అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్ లో నిరసన ఏమిటి ఇమ్రాన్ ఖాన్ కు నోటీస్ లు….

ముంబయిలో ఇటీవల జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు అధికారులు ‘లీవ్ ఇండియా’ (దేశం విడిచి వెళ్లాలి) నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నటుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్ లో నిరసనలేంటని ప్రశ్నించింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని హెచ్చరించింది….భారత పౌరుడెవరైనా విదేశాల్లో ఇలాంటి చర్యకు పాల్పడితే నెక్ట్స్ విమానంలోనే వారిని వెనక్కి పంపించేసేవారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అమెరికన్ సిటిజన్ షిప్ కార్డుపై ఇన్నాళ్లుగా భారత్ లో ఉంటున్నారని.. ఉన్నట్టుండి నిరసనల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించింది. ఓసీఐ కార్డ్ ఉన్న వ్యక్తులకు పౌరులతో సమానంగా నిరసన తెలిపే హక్కులు ఉండవని కోర్టు గుర్తుచేసింది. ‘మీరు అమెరికా వెళ్లి ఎంతైనా నిరసనలు తెలుపుకోవచ్చు, అక్కడ ఓటు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉంటూ నిరసనలు చేయడం సహించబోం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది..
ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనపై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. చిన్నప్పటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. ఇన్నాళ్లుగా భారత పౌరసత్వం ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. భారత్‌లో 4 దశాబ్దాలకు పైగా నివసించడం వల్ల తాను అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తిననే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మరిచిపోయినట్లు ఉన్నారని వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. మరోవైపు విదేశాలకు పంపకుండా ఇమ్రాన్ ఖాన్ కు గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను డిసెంబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.