బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం,, బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి..!

పరిషత్‌ ఎన్నికల్లో కూటమి విజయపరంపర కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. నీరజ.. అనూషపై 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ రేసులో ఉన్న అనూష పరాజయం వైసీపీ శ్రేణులకు నిరాశ కలిగించింది.

మరోవైపు బొత్స కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలని ప్రయత్నించడం ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి బొత్స సోదరుడి కుమారుడు చైతన్య నామినేషన్‌ దాఖలు చేయగా.. అది తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గరివిడి నుంచి కోడలు బొత్స పూజిత, గుర్ల మండలం నుంచి సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి బరిలోకి దిగారు.

అయితే స్థానిక ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థుల పోటీ, వారి గెలుపోటములు విజయనగరం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బొండపల్లిలో పాశల నీరజ విజయం వెనుక మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అనుసరించిన ఎన్నికల వ్యూహం కీలకంగా మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటున్నాయి. భారీ సభలు, ఆర్భాటపు ప్రచారాల కంటే ప్రజలతో నేరుగా మమేకమవడమే నీరజ విజయానికి దోహదపడిందని తెదేపా నేతలు విశ్లేషిస్తున్నారు.

ఈ పరిషత్ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి వేర్వేరు జడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. బొండపల్లిలో కుమార్తె అనూష ఓటమి పాలవ్వడం బొత్స సత్యనారాయణకు ఊహించని షాక్ ఇవ్వగా, గరివిడి జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసిన ఆయన కోడలు బొత్స పూజిత మాత్రం గెలుపు దిశగా పయనించడం రాజకీయ చర్చకు దారితీసింది.