రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారవేత్త, దీపావళి పండుగను పురస్కరించుకుని తన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల నగదుతో పాటు ప్రత్యేక బహుమతులు అందజేసి అందరి హృదయాలను కదిలించారు..బికానెర్కు చెందిన ఇతను, గుజరాత్‌లోని సూరత్‌లో పెద్ద బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన చేసిన ఈ ఉదారమైన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
రామ్‌స్వరూప్ మూండ్ అనే ఆ వ్యాపారవేత్త, తన సంస్థలో పనిచేసే 50 మంది ఉద్యోగులకు ఈ దీపావళి కానుకను అందించారు. యజమాని చూపించిన ఈ ఊహించని ప్రేమ, గౌరవాన్ని చూసి అక్కడున్న ఉద్యోగులంతా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై రామ్‌స్వరూప్ మాట్లాడుతూ.. ‘ఇది ఎలాంటి పబ్లిసిటీ కోసం చేసిన పని కాదు. కష్టపడి పనిచేయడం విలువ, కుటుంబాన్ని పోషించడంలో ఉండే కష్టం నాకు బాగా తెలుసు. నా దగ్గర డబ్బుల మూటలేమీ లేవు; నా కష్టంలో, నా విజయంలో నా ఉద్యోగులకు ఉన్న వాటా ఇది’ అని ఎంతో నిరాడంబరంగా చెప్పారు.