ఏపీలో సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్
సీఐఐ సదస్సులో ప్రకటించిన హోంమంత్రి అనిత.
డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థల పరీక్షలకు..
స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవకాశం.
సింగిల్ విండోలో 3 నుంచి 7 రోజుల్లో అనుమతులు
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం.
శాంతిభద్రతల పరిరక్షణకు ఏఐ టెక్నాలజీ వినియోగం
ఏఐ4ఏపీ, 15 వేల కెమెరాలతో సీసీటీవీ 360 వ్యవస్థలు
మహిళలకు అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ఒకటి-అనిత..
భవిష్యత్తులో యుద్ధ తంత్రం పూర్తిగా మారుపోతుందని, సంప్రదాయ ఆయుధాల స్థానంలో డ్రోన్‌లు, కృతిమమేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ కీలకంగా మారతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆధునిక సైబర్ ముప్పును ఎదుర్కోవడానికి, పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడానికి రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖ సీఐఐ సదస్సులో భాగంగా గురువారం జరిగిన ‘భద్రత, సాంకేతికత, వృద్ధి’ అంశంపై నిర్వహించిన ప్లీనరీలో ఆమె మాట్లాడారు..ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత రెండూ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనవని అన్నారు. ఓర్వకల్లులో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ పరిశోధన, తయారీ రంగాలకు కేంద్రంగా మారబోతుందని చెప్పారు. స్టార్ట్‌పలు, పరిశ్రమలు, డ్రోన్‌లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను పరీక్షించుకునేందుకు సైబర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వ గౌరవ సలహాదారు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ… రక్షణ పరికరాల తయారీ రంగంలో ఏపీ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. దొనకొండలో 2వేల ఎకరాల్లో డీఆర్‌డీఓ కేంద్రంతోపాటు బీడీఎల్, బీఈఎల్, భారత్ ఫోర్డ్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయన్నారు..